Begin typing your search above and press return to search.

రాముల‌మ్మ‌ను అప్ప‌ట్లో తొక్కేసే ప్ర‌య‌త్నం చేశారా?

By:  Tupaki Desk   |   13 Aug 2017 4:31 AM GMT
రాముల‌మ్మ‌ను అప్ప‌ట్లో తొక్కేసే ప్ర‌య‌త్నం చేశారా?
X
తెలుగు సినిమాలో లేడీ అమితాబ్ గా పేరు పొందిన హీరోయిన్ ఎవ‌రైనా ఉన్నారంటే అదొక్క విజ‌య‌శాంతికి మాత్ర‌మే ద‌క్కిన క్రెడిట్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. హీరోతో స‌మానంగా పారితోషికంగా తీసుకున్న హీరోయిన్ గా ఆమెకు పేరుంది. సినిమాలు.. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌తో బిజీబిజీగా ఉన్న ఆమె.. గ‌డిచిన కొద్దిరోజులుగా వాటికి దూరంగా ఉండ‌టం క‌నిపిస్తుంది.

అలాంటి విజ‌య‌శాంతి తాజాగా ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఒక ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న ఆమెకు ఎదురైంది. హీరోయిన్ అంటే విజ‌యశాంతి.. విజ‌య‌శాంతి అంటే హీరోయిన్ అన్నంత పేరు తెచ్చుకున్న వేళ‌.. ఈర్ష‌తో తొక్కేసే ప్ర‌య‌త్నం ఎవ‌రైనా ట్రై చేశారా? అన్న ప్ర‌శ్న ఎదురైంది. అయితే.. ఈ ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం ఇవ్వ‌న‌ప్ప‌టికీ తాను చెప్పాల‌నుకున్న విష‌యాల్ని రాముల‌మ్మ నోటి నుంచి వ‌చ్చాయ‌ని చెప్పాలి.

ఒక హీరోయిన్ కు హీరో ఇమేజ్ రావ‌టం ఏమిటి? హ‌య్య‌స్ట్ పెయిడ్ హీరోయిన్ ఏంటంటూ మాట్లాడినోళ్లు ఉన్నార‌ని.. అవ‌న్నీ ఓవ‌ర్ క‌మ్ చేసుకుంటూ వెళ్లేదానిన‌ని చెప్పుకొచ్చారు. ప‌ని చేసుకుంటూ పోవ‌టంతో విజ‌యాలు వాటంత‌ట అవే వ‌చ్చేవ‌ని.. ప్ర‌జ‌లు ఎంతో ఆద‌రించేవార‌న్నారు. ప్ర‌జాభిమానం ఎక్కువ‌గా ఉండ‌టంతో భ‌య‌ప‌డ‌లేద‌న్న ఆమె.. చాలా సినిమాల్లో యాక్ష‌న్ సీన్ల‌ను డూప్ లేకుండా చేసేదానిన‌న్నారు.

30 అడుగుల ఎత్తులో నుంచి దూక‌మ‌న్నా.. దూకేందుకు వెనుకాడ‌లేద‌ని.. చాలా దెబ్బ‌లు త‌గిలినా ప‌ట్టించుకోలేద‌న్నారు. సినిమాల్లో కంటే రాజ‌కీయాలు దారుణంగా.. భ‌యంక‌రంగా ఉంటాయంటూ కీల‌క వ్యాఖ్య చేశారు. మ‌రి.. అంత భ‌యంక‌ర‌మైన రాజ‌కీయాల్లోకి ఎలా వ‌చ్చార‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. తాను తెలంగాణ అంశాన్ని టేక‌ప్ చేసిన‌ప్ప‌డు కెరీర్ లో టాప్ మోస్ట్ గా ఉండేదానిన‌న్నారు. రాంగ్ డెసిష‌న్ అని చాలామంది హేళ‌న చేశార‌ని.. కొన్ని అవ‌మానాలు జ‌రిగినా ప‌ట్టించుకోలేద‌న్నారు.

ఆంధ్రా..తెలంగాణ ప్రాంతాల్లో పేరున్న న‌టిగా తెలుగు ప్ర‌జ‌ల క్షేమం కోరుకున్నాన‌ని.. రాష్ట్రాలుగా విడిపోయినా మంచి మ‌నసుల‌తో క‌లిసి ఉండాల‌ని అనుకున్నాన‌ని.. విడిపోతే ఇద్ద‌రం బాగుప‌డ‌తామ‌ని అన్నామ‌ని.. ఇప్పుడంతా హ్యాపీగా ఉండ‌టం బాగుంద‌ని చెప్పుకొచ్చారు.

ఉద్య‌మ స‌మ‌యంలో ఉన్న పార్టీలోనే ఉండి ఉంటే మంచి ప‌ద‌వి ద‌క్కేది క‌దా? పార్టీ నుంచి ఎందుకు వ‌చ్చేశార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ.. త‌న‌పూ కొన్ని కుట్ర‌లు..కుతంత్రాలు జ‌రిగాయ‌ని.. ప్ర‌తిభ ఉన్నోళ్ల‌కు ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్నారు. రాజ‌కీయాల‌న్న త‌ర్వాత వెన్నుపోట్లు త‌ప్ప‌వ‌ని.. ప్రాంతీయ పార్టీలు అలాగే ఉంటాయ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింద‌ని.. త‌న‌కా గ్రాటిట్యూడ్ ఉంద‌ని.. ప‌ద‌వులు ఇవాళ రాకున్నా రేపు వ‌స్తాయ‌ని.. అయినా తెలంగాణ సాధించామ‌న్న తృప్తి త‌న‌కుంద‌న్నారు. అది ప‌ద‌వుల కంటే ఎక్కువ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. గాంధీగారు దేశ స్వాతంత్య్రం కోసం క‌ష్ట‌ప‌డిన‌ట్లు.. తాను తెలంగాణ కోసం 19 ఏళ్లు శ్ర‌మించాన‌ని.. త‌న‌క‌ది ఒక పెద్ద అచీవ్ వెంట్ గా అభివ‌ర్ణించారు. త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత అంటే ఇష్ట‌మ‌ని.. ఆవిడ అధికారంలోకి తెచ్చిన ప్ర‌భుత్వంలో.. పార్టీలో స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌టం కోసం.. వాళ్లు త‌న‌ను రిక్వెస్ట్ చేయ‌టంతో తాను ప్ర‌చారం చేసిన‌ట్లుగా చెప్పారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి వెళ్లే ఆలోచ‌న లేద‌న్నారు.

డ్ర‌గ్స్ విచార‌ణ విష‌యంలో సినిమావాళ్లు పొర‌పాటుచేసి ఉంటే.. వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తే స‌రిపోయేద‌న్నారు. ఇదే ఫ‌స్ట్ అండ్ లాస్ట్ అని చెబితే బాగుండేదేమోన‌ని.. వేరే రంగాల్లో ఉన్న వారి పేర్లు బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని చెబుతున్నార‌ని.. మ‌రి దాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని విజ‌య‌శాంతి ప్ర‌శ్నించ‌టం గ‌మ‌నార్హం.