Begin typing your search above and press return to search.

కెప్టెన్ దెబ్బ‌కు సీపీఎం హోదా ఖ‌ల్లాస్‌

By:  Tupaki Desk   |   23 May 2016 1:23 PM GMT
కెప్టెన్ దెబ్బ‌కు సీపీఎం హోదా ఖ‌ల్లాస్‌
X
తాచెడ్డ కోతి వ‌న‌మ‌ల్లా చెరిచిన‌ట్లుంది డీఎండీకే అధినేత‌ - సినీన‌టుడు విజ‌య్‌ కాంత్ వ్య‌వ‌హార‌శైలి. విప‌రీత‌మైన ఆత్మ‌విశ్వాసంతో తమిళనాడు శాసనసభ ఎన్నికల బ‌రిలో సీఎం అభ్య‌ర్థిగా రంగంలోకి దిగిన కెప్టెన్ త‌న టీంను గెలిపించుకోవ‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే ఆఖ‌రికి త‌న‌కు తానుగా కూడా గెల‌వ‌లేక‌పోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్‌ ఆయ‌నతో పాటు సీపీఎంను కూడా చావుదెబ్బ కొట్టింది.

విజయకాంత్ త‌న‌ డీఎండీకే పార్టీని ఇతర వామ‌ప‌క్షాల‌తో జ‌ట్టుక‌ట్టించి ప్రజాసంక్షేమ కూటమి తరఫున బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ కూట‌మిలో భాగంగా బ‌రిలోకి దిగిన సీపీఎం కొంపమునిగింది. ఆ పార్టీకి జాతీయహోదా కోల్పోయే ద‌గ్గ‌రి స్థానంలో ఉన్న స‌మ‌యంలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు పెద్ద ఉప‌శ‌మ‌నంగా క‌నిపించాయి. జాతీయ పార్టీ హోదా కొనసాగాలంటే రాజ్యసభలో 11 మంది సభ్యులు కాని, నాలుగు రాష్ట్రాల్లో పోలైన చెల్లు బాట‌య్యే ఓట్లలో 6 శాతం ఓట్లను పొందిన రాష్ట్ర పార్టీగా గుర్తింపు కలిగి ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఎంకు పశ్చిమ బెంగాల్ - కేరళ - త్రిపుర రాష్ట్రాల్లో అనుకున్న ఓట్ల శాతం దక్కింది. పుదుచ్చేరి - తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉన్నట్లయితే జాతీయపార్టీ హోదాను సీపీఎం పదిలం చేసుకుని ఉండేది. అయితే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 0.7 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పోలయ్యాయి. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని మాహేలో సీపీఎం మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థి రామచంద్రన్‌ గెలిచినప్పటికీ అతను స్వతంత్ర అభ్యర్థి కావడంతో దానిని ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో సీపీఎంకు జాతీయ హోదాను కోల్పోవలసిన పరిస్థితి అనివార్యమైంది. త‌ద్వారా డీఎండీకేతో జ‌ట్టుక‌ట్టినందుకు సీపీఎం త‌గు మూల్యం చెల్లించుకుంది.

ఇదిలాఉండ‌గా 104 స్థానాల్లో పోటీ చేసిన విజ‌య్‌ కాంత్ పార్టీ ఒక్క‌టంటే ఒక స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. ఈ పార్టీకి 2.4 శాతం ఓట్లు పోలయ్యాయి. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 4.28 కోట్ల ఓట్లలో డీఎండీకే 10.43 లక్షల ఓట్లను మాత్రమే పొందింది. ఇది ఆరుశాతం ఓట్లు కన్నా తక్కువ కావడంతో ఆ పార్టీ ఎన్నికల సంఘం ‘గుర్తింపు’ హోదాను కోల్పోవడంతో పాటు ఢంకా చిహ్నం కోల్పోయే పరిస్థితి అనివార్యమైంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను త్వరలో ఎన్నికల కమిషన్‌ ప్రకటించనుంది. మొత్తంగా విజ‌య్‌ కాంత్ ఇటు త‌ను మునిగిపోవ‌డమే కాకుండా త‌న వెంట న‌డిచిన జాతీయ పార్టీ సీపీఎంను సైతం పుట్టిముంచార‌ని ఎర్ర‌న్న‌లు వాపోతున్నారు.