విజయశాంతికి ఓకే చెప్పిన రాహుల్ గాంధీ?

Sun Dec 10 2017 15:37:36 GMT+0530 (IST)

   
2014 ఎన్నికల తరువాత రాజకీయాల్లో కనిపించని మాజీ ఎంపీ విజయశాంతి మళ్లీ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమెను ఏఐసీసీ సెక్రటరీగా నియమించేందుకు రాహుల్ గాంధీ ఆమోదం పలికినట్లుగా సమాచారం.
    
కాగా నెల రోజుల కిందటే ఆమె రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అప్పుడే ఆమెకు పదవి ఇచ్చేందుకు రాహుల్ అంగీకారం తెలిపారని చెబుతున్నారు. రాహుల్ తో విజయశాంతి భేటీ సమయంలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా కూడా ఉన్నారట.
    
గతంలో తెరాస తరఫున ఎంపీగా చేశారు విజయశాంతి. అయితే తెలంగాణ ఏర్పడే సమయంలో విబేధాలతో ఆ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
    
ఆ తరువాత గత ఏడాది డిసెంబరులో జయలలిత మరణం తరువాత విజయశాంతి అక్కడి రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది.  తమిళనాట శశికళ వర్గంతో విజయశాంతి సన్నిహితంగా మెలగడంతో అలాంటి అంచనాలు వెలువడ్డాయి. రర్దయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ తరఫున ఆమె ప్రచారం కూడా చేశారు.. కానీ మళ్లీ ఎందుకో ఇప్పుడామె తెలంగాణలోనే మరోసారి అవకాశాలను అదృష్టాన్ని వెతుక్కోవడానికి సిద్ధమవుతున్నారు.