Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అమ్ముల పొదిలో 'సీక్రెట్' అస్త్రం

By:  Tupaki Desk   |   11 Aug 2018 5:42 AM GMT
కాంగ్రెస్ అమ్ముల పొదిలో సీక్రెట్ అస్త్రం
X
విజయశాంతి.. ఒకప్పుడు టాలీవుడ్ హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకొని తెలుగునాట నంబర్1 హీరోయిన్ గా ఎదిగారు. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో అగ్ర తారగా వెలుగొందారు. చాలా రోజుల తర్వాత మళ్లీ రాజకీయాల్లో కూడా అంతే చురుకైన పాత్ర పోషించారు. టీఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాత నంబర్ 2 పొజిషన్ లో కొనసాగారు. కానీ ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాలతో కాంగ్రెస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి టీఆర్ ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్న విజయశాంతి తాజాగా 2019 ఎన్నికల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

టీఆర్ ఎస్ పార్టీలో వెలుగు వెలిగి.. అనంతరం విభేదాలతో కాంగ్రెస్ లో చేరిన రాములమ్మ.. టీఆర్ ఎస్ చేతిలోనే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో మనస్థాపం చెందారట.. అందుకే గడిచిన నాలుగేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో యాక్టివ్ రోల్ ప్లే చేయడానికి విజయశాంతి రెడీ అవుతున్నారట.. మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన రాములమ్మ చాలాకాలం తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా వ్యవహరించడానికి విజయశాంతి రెడీ అయ్యారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

ప్రస్తుతం విజయశాంతి ప్రాతినిధ్యం వహించిన మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పుడు మళ్లీ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడంతో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయి. కార్యకర్తలు- నేతలు.. విజయశాంతి - శశిధర్ రెడ్డి అనుకూల వర్గాలుగా విడిపోయారట.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ శక్తియాప్ పరిశీలన కార్యక్రమం మెదక్ లో నిర్వహించగా.. విజయశాంతి - శశిధర్ రెడ్డి వర్గాలు బాహాబాహీకి దిగారు.

తాజాగా తాను మళ్లీ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజయశాంతి చెప్పారట.. అధిష్టానం కూడా దీనికి సరేననడంతో బంగారం బోనంతో విజయశాంతి చాలా రోజుల తర్వాత ప్రజల వద్దకు వచ్చారు.. వచ్చే ఎన్నికల్లో విజయశాంతి సేవలను బాగా వాడుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఆమెకు ప్రచార కమిటీ బాధ్యతలు కూడా అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అటు విజయశాంతి కూడా మెదక్ లేదా పటాన్ చెరువు నుంచి పోటీచేయాలని భావిస్తున్నారట.. మరి రీఎంట్రీతో విజయశాంతి మెరుస్తారా.? టీఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటారా అన్నది వేచి చూడాల్సిందే..