Begin typing your search above and press return to search.

కూటమి ఓటమికి కారకులెవరు..?

By:  Tupaki Desk   |   13 Dec 2018 3:30 PM GMT
కూటమి ఓటమికి కారకులెవరు..?
X
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల వైనం. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగిన బద్ద వైరులైన‌ కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీ లు ఇప్పుడు లోపాలను వెతుక్కునే పనిలో పడ్డాయి. ప్రతిపక్షాలు ఊహించని విజయంతో తెరాస విజయం సాధించింది. డిపాజిట్ కూడా కూటమికి దక్కలేదు. ఇంతటి ఘోర పరాజయానికి కారణం ఏమిటా అని అటు కాంగ్రెస్ నాయకులు - తెలుగుదేశం నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ విజయశాంతి మాట్లాడుతూ చంద్రబాబుతో చేతులు కలపడంతోనే తమకు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణమని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం అధినేత అయిన చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత వలనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దెబ్బ తిందని విజయశాంతి అన్నారు. తెలుగుదేశంతో చేతులు కలపకుండా వంటరిగా బరిలోకి దిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఇదే విష‌యమై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది చిన్న చిత‌కా నాయ‌కులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.

ఈ నెల 11వ తేదీన ఫలితాల అనంతరం విజయశాంతి - మెదక్ జిల్లాకు చెంది కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం అయ్యారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఈ పరిస్థితిని తాను ముందే ఊహించానని - ఈ విషయమై అధిష్టానానికి లేఖ కూడా రాసానని అయితే అధిష్టానం ఈ పెద్దగా పట్టించుకోలేదని విజయశాంతి అన్నారు. అయితే ఈ విషయంమై తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఎవరు కూడా పెదవి విప్పడం లేదు. తమ అధినేత రాహుల్ గాంధీ నుంచి ఇంకావారికి స్పష్టమైన సంకేతాలు రాలేదని అంటున్నారు.

ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటున్నట్లు సమచారం. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లో కూడా బాబుతో ప్రయాణిస్తుందనే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బాబుపై ఎటువంటి ఆరోపణలు చేయటం లేదని వినికిడి. అయితే తెలంగాణలో చేసిన తప్పునే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్‌ లో కూడా చేస్తుందా అని కొందరు విశ్లేషించుకుంటున్నారు. సైకిల్ తో జతకట్టిన హస్తం ఎంతటి ఘోరపరాభవాన్ని ఎదుర్కొందో రుజువైంది కదా... మళ్లీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలకు వెడుతుందా..... ఏమో ఏమగునో వేచి చూద్దాం.