కేసీఆర్ తో ఢీకొట్టేందుకు ఆ హీరోయిన్ ను దింపుతారట

Fri Oct 13 2017 19:52:22 GMT+0530 (IST)


టాలీవుడ్ ఒకనాటి టాప్ హీరోయిన్ - ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవలి కాలంలో క్రియాశీలంగా ఎక్కడ కనిపించని సంగతి తెలిసిందే. గత ఏడాది తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాల్లో చిన్నమ్మ శశికళ వర్గానికి రాములమ్మ మద్దతిచ్చారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ కు వెళ్లిన విజయశాంతి చిన్నమ్మ శశికళతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏ మంతనాలు జరిగిందనేది చర్చకు రాలేదు. అంతకుముందుకు విజయశాంతి మెరీనా బీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని దర్శించుకొని అంజలి ఘటించారు. జయలలిత మృతి తీరని లోటని అన్నారు. ఆ తర్వాత కూడా ఆమె ఎక్కడా మీడియాతో ముచ్చటించలేదు.సినీరంగం నుంచి దూరమవుతున్న సమయంలోనే  తెలంగాణా రాష్ర్టం కోసం 'తల్లి తెలంగాణ' పార్టీ పెట్టిన విజయశాంతిని ఒప్పించి టీఆర్ ఎస్ లో చేర్పించడమే కాకుండా...పార్టీని విలీనం చేయించడంలోనూ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. టీఆర్ ఎస్ లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ కు విజయశాంతి అత్యంత సన్నిహితంగానే ఉన్నారు. పలు ఎన్నికల ప్రచారాల్లోనూ రాములమ్మ కీలక పాత్ర పోషించారు. దీంతో టీఆర్ ఎస్ కు కొంత సినీ గ్లామర్ తోడయ్యింది. అయితే కేసీఆర్ వ్యవహారశైలి వల్ల 2014 సాధారణ ఎన్నికలకు ముందు విజయశాంతి టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం విజయశాంతి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తెరమరుగు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు సైతం రాములమ్మ దూరంగానే ఉన్నారు.

అయితే త్వరలో ఆమె పాలిటిక్స్ లో యాక్టివ్ కానున్నారని సమాచారం. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించనున్న ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ రాములమ్మను తన కోర్ టీంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సినీగ్లామర్ తెచ్చేందుకు....టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు - టీఆర్ ఎస్ పార్టీకి ధీటుగా పని చేస్తారన్న విశ్వాసంతో విజయశాంతికి కాంగ్రెస్ ప్రాముఖ్యతను ఇవ్వనుందని అంటున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాములమ్మకు అప్పజెప్పే ఈ బాధ్యతలతో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను - నెరవేర్చని హామీలను - మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారని అంటున్నారు.  

అయితే రాములమ్మపై కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెట్టుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టీఆర్ ఎస్ పార్టీ హవాను తట్టుకోలేక ఓడిపోయిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకురాగలరా అనేది సందేహమేనని అంటున్నారు.