Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక హోదాకు షార్ట్ క‌ట్ చెప్పిన వైసీపీ

By:  Tupaki Desk   |   30 Aug 2016 10:29 AM GMT
ప్ర‌త్యేక హోదాకు షార్ట్ క‌ట్ చెప్పిన వైసీపీ
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విష‌యంలో సాగుతున్న సెంటిమెంట్ ఎపిసోడ్‌ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటు ద్వారా హోదా క‌ల్పించ‌డం, విభ‌జ‌న హామీ నిలుపుకోవ‌డం అనే పంథాలోనే ముందుకు సాగి ఇటీవ‌ల నిరాశ‌పూరిత స‌మాచారం తెర‌మీద‌కు తెస్తున్న సంగ‌తి తెలిసిందే. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఎక్కడా చెప్పలేదని పేర్కొంటూ కేంద్ర దాట‌వేస్తున్న తీరును వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి త‌ప్పుప‌ట్టారు. కేంద్రం త‌లుచుకుంటే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌వ‌చ్చున‌ని తెలియ‌జెప్పారు.

విశాఖలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదని స్ప‌ష్టం చేశారు. స్పెష‌ల్ స్టేట‌స్ కోసం మొదటి నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందని ప్ర‌స్తావించారు. ఎన్నిక‌ల హామీని నిలుపుకోవాల‌ని కోరిన విజ‌య‌సాయి...ఆర్థిక సంఘం ప్ర‌స్తావ‌న స‌రికాద‌ని తేల్చిచెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌నుకుంటే "ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్" ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా స్థానం కల్పించవచ్చునని వివ‌రించారు. ఈ ఆదేశాల ద్వారా కార‌ణాలు వివ‌రిస్తూ స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తే మిగ‌తా రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం పెద్ద‌గా అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌వ‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.

రాజ‌కీయాల గురించి విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ రాబోయో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని చెప్పారు. తెలుగు ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ తో చేతులు కలిపేది లేదని తేల్చిచెప్పేశారు. పోలవరం నిర్మాణం తక్షణమే జరగాలని విజ‌య‌సాయి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదనీ, అందులో జరుగుతున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తుందని చెప్పారు. పట్టిసీమ ద్వారా సీఎం చంద్ర‌బాబు రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని విజ‌య‌సాయిరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు పురుషోత్తపట్టణం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరికొంత ధనాన్ని దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర తో జల ఒప్పందం కుదుర్చుకుందని, 1,450 టీఎంసీలు మహార్రాష్ట నుంచి వస్తే 950 టీఎంసీలు వాడుకుంటామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెప్ప‌డంపై సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో పీక‌ల దాకా కూరుకుపోవ‌డం వ‌ల్లే చంద్ర‌బాబు స్పందించ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు.