Begin typing your search above and press return to search.

ఆ ఎన్నిక‌పై జ‌గ‌న్ పార్టీ అనూహ్య నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   9 Aug 2018 5:36 AM GMT
ఆ ఎన్నిక‌పై జ‌గ‌న్ పార్టీ అనూహ్య నిర్ణ‌యం!
X
హోరాహోరీగా సాగుతున్న రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక‌పై ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకుంది. తొలుత ఎన్డీయే అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని భావించిన జ‌గ‌న్ పార్టీ తాజాగా అందుకు భిన్న‌మైన నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. తాము ఎన్డీయేకి కానీ.. విప‌క్షాల‌కు కానీ మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని.. తాము పోలింగ్ లో పాల్గొన‌మంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌ సాయిరెడ్డి స్ప‌స్టం చేశారు.

కాంగ్రెస్‌.. బీజేపీలు రెండూ ఏపీకి తీర‌ని ద్రోహం చేశాయ‌ని.. అందులో ఎలాంటి సందేహం లేద‌న్న మాట‌ను చెప్పారు. ఈ కార‌ణంతోనే రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక‌ల్లో రెండు పార్టీల‌కు ఓటు వేయొద్ద‌ని తాము నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు.

ప్ర‌త్యేక హోదా అంశాన్ని విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర్చ‌కుండా రాజ్య‌స‌భ‌లో అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ కేవ‌లం నోటి మాట‌గానే చెప్పార‌ని గుర్తు చేసిన విజ‌య‌సాయి రెడ్డి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామ‌ని చెప్పిన బీజేపీ.. ఏపీకి ద్రోహం చేసిన‌ట్లు మండిప‌డ్డారు. ఏపీని మోసం చేసిన విష‌యంలో కాంగ్రెస్‌.. బీజేపీలు రెండూ ఒక్క‌టేన‌న్న విజ‌య‌సాయి.. టీడీపీపై నిప్పులు చెరిగారు.

ఏపీకి ద్రోహం చేసిన పార్టీల‌తో టీడీపీ రాజ‌కీయ వ్య‌భిచారానికి పాల్ప‌డుతుంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తి లాంటి కీల‌క రాజ్యాంగ ప‌ద‌వుల‌న్నీ ఏక‌గ్రీవం కావాల‌న్నదే త‌మ అభిప్రాయంగా చెప్పారు. డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి ప్ర‌తి ఒక్క పార్టీ ఓట్లు కీల‌కంగా మారిన వేళ‌.. జ‌గ‌న్ పార్టీ తీసుకున్న నిర్ణ‌యం అనూహ్యంగా మారి భారీ షాక్ ను ఇచ్చేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.