Begin typing your search above and press return to search.

ఏపీలో బాబుకు మోత్కుప‌ల్లితో స్కెచ్?

By:  Tupaki Desk   |   12 Jun 2018 9:51 AM GMT
ఏపీలో బాబుకు మోత్కుప‌ల్లితో స్కెచ్?
X
ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. లేనిది ఉన్న‌ట్లు ప్ర‌చారం చేయ‌డం...అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డంలో బాబుగారు సిద్ధహ‌స్తుడు. బాబుగారి గోబెల్స్ ప్ర‌చారంపై ఈ మ‌ధ్య సోషల్ మీడియాలో ఒక జోక్ వైర‌ల్ అయింది. అమ‌రావ‌తిని ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధానిగా తీర్చిదిద్దుతున్నాన‌ని చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న చూసి పొరుగు రాష్ట్రానికి ఓ ఔత్సాహిక ద‌ర్శ‌కుడు అమ‌రావ‌తిని సంద‌ర్శించాడ‌ట‌. బాబుగారి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చూసి.....ఆ రేంజ్లో అమ‌రావ‌తిని ఊహించుకున్న అత‌డికి షాక్ త‌గిలింద‌ట‌. దీంతో, ఇక్క‌డ షూటింగ్ చేసే ఆలోచ‌న‌ను స‌దరు ద‌ర్శ‌కుడు విర‌మించుకొని తిరుగు టపాలో వెళ్లిపోయాడ‌ట‌. నిన్నటికి నిన్న‌...పోల‌వ‌రం డయాఫ్ర‌మ్ వాల్ ను జాతికి అంకిత‌మిచ్చిన తొలి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌చార ఆర్భాటాల‌పై ఏపీ సీఎంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చంద్రబాబు ఓ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అంటూ ధ్వ‌జ‌మెత్తారు. లేనిది ఉన్నట్టుగా - ఉన్నది లేనట్టుగా గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రోజులో 13 వేల క్యూబిక్ మీటర్ల పనులు చేశామని చంద్రబాబు చెప్ప‌డం ఆ ప్ర‌చారానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఈ విషయాన్ని తిరుమల వెంకన్న మీద ప్రమాణం చేసి చంద్ర‌బాబు చెప్పగలరా? అని స‌వాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ ఆర్‌ కల అని - తమ ప్రభుత్వం ఏర్పడగానే పోలవరాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితం చంద్ర‌బాబుపై తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, మోత్కుప‌ల్లి - విజ‌య‌సాయిరెడ్డిల నుద్దేశించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. వాస్త‌వానికి తాను మోత్కుప‌ల్లిని కలవాలనుకోలేదని - ఇపుడు తప్పకుండా కలుస్తానని అన్నారు. దళిత నేతను తాను కలిస్తే తప్పేమిట‌ని - చంద్ర‌బాబు ఎందుకు భయప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు, మోత్కుపల్లి రాజకీయ భవిష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌మైన నేప‌థ్యంలో మోత్కుపల్లిని చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయించేందుకు వైసీపీ య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీలో వాడవాడకు తిరిగి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాన‌ని మోత్కుపల్లి వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు వైసీపీ అన్ని విధాలుగా సహకరించ‌నుంద‌ని టాక్. ఈ నేప‌థ్యంలోనే మంగ‌ళ‌వారం నాడు మోత్కుప‌ల్లిని క‌లిసేందుకు విజ‌య‌సాయిరెడ్డి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల వారివురూ భేటీ కాలేద‌ని తెలుస్తోంది. మ‌రి , టీఆర్ ఎస్ లో చేరేందుకు మోత్కుప‌ల్లి రెడీగా ఉన్నార‌న్న నేప‌థ్యంలో ఆయ‌న స్పంద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.