Begin typing your search above and press return to search.

బాబు బీపీ పెంచుతున్న వైసీపీ నేత‌

By:  Tupaki Desk   |   13 Jun 2018 3:27 PM GMT
బాబు బీపీ పెంచుతున్న వైసీపీ నేత‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు కొత్త స‌మ‌స్య ఎదుర‌వుతోంది. ఇన్నాళ్లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి త‌న‌పై అంశాల వారీగా విరుచుకుప‌డుతూ టార్గెట్ చేస్తున్న నేప‌థ్యంలో బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే దీనికి తోడుగా మ‌రో నేత అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌నే వైసీపీ సీనియ‌ర్ నేత‌ - ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా విజ‌య‌సాయి ఎంచుకుంటున్న అంశాలు ఎదురుదాడి చేస్తున్న తీరు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. తాజాగా విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో అవ‌క‌త‌వ‌క‌లపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలకు టీటీడీ ఉపక్రమించింది. వాళ్లు చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ ఇద్దరికి నోటీసులు జారీచేసింది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దీన్ని చాలా క్యాజువ‌ల్‌ గా తీసుకున్నారు. తనకు ఇంత వరకు టీటీడీ నోటీసులు అందలేదని.. ఆ విషయం టీవీలో చూసి తెలుసుకున్నట్టు చెప్పారు. నోటీసుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. తనకు నోటీసులిచ్చే అధికారం మీకెవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. టీటీడీది కేవలం అభ్యర్థన మాత్రమేనని.. దానిని నోటీస్ అనలేమని తెలిపారు. అయినా నోటీసులు ఇచ్చేందుకు టీటీడీకి ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. గతంలో తాను 10 విషయాలు మాత్రమే చెప్పానని.. ఇప్పుడు 14 విషయాలు చెబుతానని అన్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తిని సోర్స్ ఏంటని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని స్ప‌ష్టం చేశారు.

నిప్పు నాయుడు - పప్పు నాయుడుకి నిజంగా దమ్ము - చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని విజయసాయి రెడ్డి సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే తండ్రీకొడుకుల అవినీతి మొత్తం బయటపెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చెప్పారు. 'నేను పదమూడు గంటల సమయం ఇస్తే ఆయన స్పందించలేదు, ఇప్పుడు మళ్లీ చాలెంజ్ చేస్తున్నా, ప్రభుత్వ ఖజానా అని చెప్పి దేవస్థానం నిధులు దోచుకున్నారు' అని ఆయన అన్నారు. వారి ఇంట్లో నేలమాలిగలు సోదా చేసి ఉంటే దోచుకున్న సొమ్ములు దొరికేవని, సీబీఐ విచారణలో మాత్రమే అవన్నీ బయట పడతాయని విజయసాయిరెడ్డి వివరించారు. కాగా, విజ‌య‌సాయిరెడ్డి ఇంత స్ప‌ష్టంగా, ధైర్యంగా సీబీఐ విచార‌ణ డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో..టీడీపీ శ్రేణుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని అంటున్నారు.