పవన్ పై.. సైరా పంచ్ లు పేలుతున్నాయి !

Thu Dec 06 2018 21:15:00 GMT+0530 (IST)

రాజకీయం సీరియస్ గా చేయాలనుకునే రోజులు పోయాయి. ఇపుడు ప్రజలంతా ఎంటర్ టైన్ మెంట్ మోడ్ లో ఉంటున్నారు. పనిచేయడం - ఎంజాయ్ చేయడం... ఈ రెండే జనాలు చేసేవి. దీనిని బాగా పసిగట్టారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి. ఇటీవల ఆయన తన ట్విట్టరులో బ్రహ్మాండమైన పంచ్ లతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. నిన్న చిట్టినాయుడు అంటూ లోకేష్ కు కొత్త పేరు పెట్టిన సాయిరెడ్డి టీం... ఈరోజు పవన్ కు ఆయన సినిమా సీన్లనే వాడి అదిరిపోయే పంచ్ లు వేసింది.ఈరోజు అనంతరపురంలో పవన్ మాట్లాడుతూ *జగన్ గుర్తించనంత మాత్రాన జనసేన లేనట్టా* అని వ్యాఖ్యానించారు. దీని ఆధారంగా పవన్ అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్స్ తో మీమ్ తయారుచేశారు. చంద్రబాబును చూసి పవన్ అంటున్నట్లుగా ఉన్న ఆ సీన్‌లో *నువ్వు ఆడమన్నట్లు ఆడినందుకు ఇదీ నా పార్టీ పరిస్థితి. కుదిరితే క్షమించు - లేదా శిక్షించు. కానీ నాదీ ఒక పార్టీ అని కనీసం గుర్తించమని చెప్పండి పార్టనర్... చెప్పండి* అంటూ ఆ మీమ్ తయారుచేశారు. దీనిని నెటిజన్లు విపరీతంగా ఆదరించారు.

మరో మీమ్ లో పవన్ విచిత్రమైన ఫోజులను ఎద్దేవా చేశారు. కొందరు వృద్ధులున్న చోట వారు కుర్చీలో కూర్చుని ఉండగా... పవన్ కింద కూర్చుని వారితో ముచ్చటిస్తున్న సీను - అత్తారింటికి దారేదిలో అత్త కాళ్ల వద్ద కూర్చుని ఏడుస్తున్న సీను... కలిపి పవన్ ఎక్కడ బాగా నటిస్తున్నారు?  రాజకీయాల్లోనా? సినిమాల్లోనా? అని వేసిన వ్యంగాస్త్రపు సందేహం ట్రోలర్స్ తెగ వాడేస్తున్నారు. మొత్తానికి సాయి రెడ్డి ... SAI RAA PUNCH (సైరా పంచ్) పేరిట జనసేనకు చురుకు పుట్టిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే.. సాయిరెడ్డి పెట్టిన టైటిల్ కేవలం సాయిరెడ్డి పేరు మాత్రమే కాదు... పవన్ అన్న చిరంజీవి రాబోయే సినిమా పేరు కూడా కావడంతో బాగా పేలుతున్నాయి.