Begin typing your search above and press return to search.

ఓడింది వారు కాదు.. వీరు..!

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:22 PM GMT
ఓడింది వారు కాదు.. వీరు..!
X
జానారెడ్డి... రేవంత్ రెడ్డి.... నందమూరి సుహాసిని... డి.కె. అరుణ.. భవ్యప్రసాద్.. వీరందరూ తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఓటమి పాలైయ్యారు అనుకుంటున్నారా...! కాదు.. కాదు.. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఓడిన వారు వేరే ఉన్నారు. వారెవరా అని తలలు పట్టుకుంటున్నారా.. అవసరం లేదు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఓటమి పాలైంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్‌ ముఖ‌్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయనే కాదు ఆంధ్రప్రదేశ్‌ లోని హిందూపురం ఎమ్మెల్యే - నటుడు బాలకృష్ణ - ఇద్దరు మీడియా యజమానులు. అదేమిటి ఈ నలుగురు తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయలేదు కదా.. వీరు ఓడిపోవడం ఏమిటీ అనుకుంటున్నారా. మీ అనుమానం నిజమే.. వారి ఓటమి నిజమే. తెలంగాణ ముందస్తు ఎన్నికలు ప్రకటించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు మహాకూటమి ఏర్పాటుకు బద్దశత్రువు కాంగ్రెస్‌ తో చేతులు కలిపారు. నేనున్న మనమే గెలుస్తామంటూ ప్రచారమూ చేసారు. ఒక దశలో తాను లేకపోతే హైదరాబాద్ అభివ్రుద్ది లేదంటూ నగర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాజధానితో పాటు తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఖమ్మంలోను ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబు ఎవరిని గెలిపించమన్నారో వారంతా ఓడారు. అంటే బాబూ ఓడిపోయారు.

ఇక కూకట్‌ పల్లి నుంచి పోటీ చేసిన తన అన్న కుమార్తే నందమూరి సుహాసిని విజయం కోసం నటుడు - ఎమ్యెల్యే బాలకృష్ణ ప్రచారం చేసారు. పంచ్ డైలాగులతో తన ప్రచారానికి సినిమా హంగులు అద్దారు. అయితే తన అన్న హరికృష్ణ కుమార్తే సుహాసిని పరాజయం పాలయ్యారు. అంటే బాలకృష్ణా ఓడిపోయారు. ఇక "పచ్చ" పత్రికలుగా పేరున్న రెండు పత్రికల అధిపతులు ఈ ఎన్నికలలో ఓటమి పాలయ్యారని వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ నాయకడు విజయసాయి రెడ్డి ట్విట్ చేసారు. ఆ ఇద్దరే అని విజయసాయి రెడ్డి ముక్తాయింపు ఇచ్చారు. వీరిద్దరూ మహాకూటమి విజయం కోసం తమ సాయశక్తుల ప్రయత్నించారని - అభూత కల్పనలు - అసత్యాలు ప్రచారం చేసారని విజయసాయి రెడ్డి విమర్శించారు.