అన్నంత పనిచేసిన విజయసాయి..టీడీపీలో కలవరం

Thu Jun 14 2018 19:03:05 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టార్గెట్ గా అనూహ్య రీతిలో ఎదురుదాడి చేస్తున్న పరంపరలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తాజాగా ఆయన హైదరాబాద్ లో కలిశారు. ఇటీవల మోత్కుపల్లిని కలిసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. `మోత్కుపల్లి నర్సింహులును కలవాలంటే నాకు చంద్రబాబు అనుమతి అవసరం లేదు. వాస్తవానికి నాకు మోత్కుపల్లిని కలవాలనే ఆలోచన లేకపోయినా టీటీడీ నేతలకు బుద్ధి చెప్పేందుకే ఆయన్ను కలవాలని భావిస్తున్నా`` అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అన్నట్లుగానే...ఆయన మోత్కుపల్లిని కలిశారు.టీడీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో ఉన్న తెలంగాణలోని అతికొద్ది మంది నాయకుల్లో ఒకరైన మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ జయంతి రోజు చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించగా.. తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఏపీ సీఎంపై విరుచుకుపడ్డారు. బాబుది మిత్ర ద్రోహమని.. నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడంలో నెంబర్ వన్ అంటూ మండిపడ్డారు. ఆయన ఓడిపోవాలంటూ తిరుమల కొండకు యాత్ర చేస్తానని.. ఆరోగ్యం సహకరించకపోయినా నడిచి వెళ్లి మరీ వెంకటేశ్వర స్వామికి మొక్కుతానని చెప్పారు. అలాగే టీడీపీ అధినేతకు వ్యతిరేకంగా ఏపీలో కూడా యాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. ఇలా చంద్రబాబు తీరుపై దుమ్మెత్తిపోసిన మోత్కుపల్లి ఇంటికి వైసీపీ ముఖ్యనేత - ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఇద్దరు నేతలు తాజా రాజకీయాలతో పాటూ.. ఏపీలో పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే మోత్కుపల్లి చేపట్టే తిరుమల యాత్రకు వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని కూడా తెలిపారని ప్రచారం జరుగుతోంది. మోత్కుపల్లితో భేటీ అనంతరం  విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడలేదు.

కాగా ఈ పరిణామంపై సహజంగానే టీడీపీ నేతలు కలవర పాటుకు గురవతున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే... వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత తమ పార్టీకి చెందిన మాజీ నాయకుడి వద్దకు వెళ్లడం తమను ఇరకాటంలో పడేసేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ పరిణామంతో మోత్కుపల్లి మరింత చెలగరేగి పోవడం ఖాయమని అది చంద్రబాబు పరువు సమస్యగా మారనుందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.