Begin typing your search above and press return to search.

సీఎంఓ అధికార్లకు స్పీకర్ లోబడుతున్నాడా?

By:  Tupaki Desk   |   23 Feb 2018 4:17 AM GMT
సీఎంఓ అధికార్లకు స్పీకర్ లోబడుతున్నాడా?
X
సాధారణంగా శాసనసభ స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. పదవిలోకి వచ్చే ముందు ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికైన వ్యక్తే అయినప్పటికీ.. గౌరవప్రదమైన ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత.. ఎలాంటి రాజకీయ భావజాలం - పక్షపాతంతో కూడిన ప్రవర్తన ఉండరాదనే ఉద్దేశంతో.. పార్టీకి రాజీనామా చేస్తారు. తటస్థ వ్యక్తిగానే సభకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అయితే తాజాగా ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి.. స్పీకరుపై వినిపిస్తున్న వ్యాఖ్యలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

అసెంబ్లీ స్పీకరు కోడెల శివప్రసాద్ .. సీఎంఓ లోని అధికార్ల అదేశాలు - లేదా సూచనల మేరకు పనిచేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. అలాంటి అనుమానం వచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ విజయసాయి ఎంపీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

ఈ విమర్శలకు ఒక ప్రాతిపదిక ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి గెలపొందిన వారు ఇప్పటిదాకా 23 మంది ఎమ్మెల్యేలు తమకు పదవిని అందించిన పార్టీని విడచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరి మీద ఎప్పటికప్పుడు ఆ పార్టీ నాయకులు స్పీకరుకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన నిర్ణయం తీసుకోకపోయేసరికి కోర్టును కూడా ఆశ్రయించారు.

అయితే ఈ విషయంలో స్పీకరు తనకు అందిన ఫిర్యాదు మీద - సదరు ఎమ్మెల్యేలకు నోటీసు పంపి.. విచారించి, తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటిలోగా నిర్ణయం అనేది పూర్తిగా ఆయన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏపీలో ఏళ్లు గడుస్తున్నా నిర్ణయం మాత్రం రాలేదు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్న సంగతి అందరికీ తెలుసు.

ఈ నేపథ్యంలో సీఎంఓ అధికారులు రాజమౌళి - సతీష్ చంద్ర - సాయిప్రసాద్ - ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు తదితరులు స్పీకరు అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగేలా చేస్తున్నారని విజయసాయి అంటున్నారు. స్పీకరు నిర్ణయాల్ని ఈ అధికారులు ప్రభావితం చేస్తున్నారా? లేదా మరో రకంగానా? అనే స్పష్టత ఇవ్వలేదు. సాధారణంగా సీఎం కంటె ఉన్నతమైన రాజ్యాంగబద్ధ స్థానంలో ఉండే స్పీకరు.. అధికార్ల సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకపోవడం అనేదే కీలకవిమర్శగా కనిపిస్తోంది.