Begin typing your search above and press return to search.

మాల్యాను జంప్ చేయించింది మోడీయే తెలుసా?

By:  Tupaki Desk   |   14 Sep 2018 11:03 AM GMT
మాల్యాను జంప్ చేయించింది మోడీయే తెలుసా?
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ఆర్థిక‌ప‌ర‌మైన అంశాల్లో ఇరికించాల‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ కంక‌ణం క‌ట్టుకుందా? దేశ‌భ‌క్తి పేరుతో ప్ర‌చారం చేసుకునే బీజేపీని అదే ఎజెండా ఆధారంగా బుక్ చేయాల‌ని హ‌స్తం పార్టీ చూస్తోందా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగవేసిన లిక్క‌ర్ కింగ్‌ మాల్యా.. తాను బ్రిటన్‌ కు వెళ్లేముందే ఆర్థిక మంత్రి జైట్లీకి చెప్పినట్లు ఇటీవల వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న అంద‌రి చూపును బీజేపీ వైపు ప‌డేలా చేసింది. అయితే, ఈ సంద‌ర్భాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటున్నారు. వ్యాపారవేత్త విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడానికి ప్రధాని మోడీ సాయం చేశారని ఆరోపించారు.

భారత్ విడిచి వెళ్లేముందు తాను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీని కలిశానని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్‌మాల్యా గత బుధవారం లండన్‌ లో వెల్లడించాడు. తనను భారత్‌ కు అప్పగించేందుకు సంబంధించిన కేసుపై విచారణ జరుపుతున్న వెస్ట్‌ మినిస్టర్ కోర్టుకు హాజరైన విజయ్‌ మాల్యా మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించాడు. ``జెనీవాలో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు నేను భారత్ నుంచి వచ్చాను. అంతకుముందే నేను ఆర్థికశాఖ మంత్రి జైట్లీని కలిశాను. బ్యాంకు రుణాల సెటిల్‌ మెంట్‌ కు సంబంధించి నా ఉద్దేశాన్ని ఆయనకు వివరించాను అని తెలిపాడు. తాను బ్యాంకులకు రుణపడ్డ మొత్తాన్ని చెల్లించేందుకు కృషి చేస్తుంటే బ్యాంకులు తనకు ఎందుకు సహకరించడం లేదో మీడియా ప్రశ్నించాలని విజయ్‌ మాల్యా మీడియాకు విజ్ఞప్తి చేశాడు. నన్ను రాజకీయంగా ఫుట్‌ బాల్‌ ను చేశారు. ఈ రాజకీయ క్రీడలో నేను చేసేదేమీ లేదు. నా ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. దాదాపు 15 వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలతో సమగ్రమైన సెటిల్‌ మెంట్ ఆఫర్‌ ను కర్ణాటక హైకోర్టు ముందుంచాను. ఈ ఆఫర్ ద్వారా నా మొత్తం అప్పులను తీర్చవచ్చు. నన్ను బలిపశువును చేశారు. రెండు రాజకీయ పార్టీలకు నేనంటే ఇష్టంలేదు అని` మాల్యా పేర్కొన్నాడు.

దీనిపై ఇవాళ మళ్లీ రాహుల్ ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2015 అక్టోబర్ 16వ తేదీన సీబీఐ మాల్యాకు నోటీసులు ఇచ్చింది. నవంబర్ 24న మరో నోటీసు ఇచ్చింది. డిసెంబర్ 9 - 10 -11 తేదీల్లో మాల్యాను విచారించామని, కానీ ఆయన మళ్లీ రారన్న విషయాన్ని గ్రహించలేకపోయామని సీబీఐ వెల్లడించింది. వీట‌న్నింటినీ ప్ర‌స్తావిస్తూ...మాల్యా గ్రేట్ ఎస్కేప్ వెనుక సీబీఐతో పాటు ప్రధాని మోడీ కూడా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీ సంకేతాల మేరకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసిందన్నారు. సీబీఐ నేరుగా ప్రధాని మోడీకి మాత్రమే రిపోర్ట్ చేస్తుందని, కానీ ఈ కేసులో సీబీఐ అలా ఎలా వ్యవహరించిందో అర్థం కావడం లేదని - మోడీ కనుసన్నల్లోనే సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసిందన్నారు. సీబీఐ తొలుత డిటెన్షన్ నోటీసును ఇచ్చిందని, కానీ మోడీ ఆదేశాలతో ఆ నోటీసు కాస్తా లుకౌట్‌ గా మారిందని ఆరోపించారు.