Begin typing your search above and press return to search.

ఎన్డీఏ ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా సాగర్ జీ?

By:  Tupaki Desk   |   26 Jun 2017 2:16 PM GMT
ఎన్డీఏ ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా సాగర్ జీ?
X
రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిత్వాన్ని కొలిక్కి తెచ్చిన బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ కూట‌మి ఇపుడు ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిత్వంపై దృష్టి సారించిందా? రాబోయే ఎన్నిక‌ల్లో ఎన్డీఏ ఉప రాష్టపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పేరును పరిశీలిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

ప్రస్తుత ఉప రాష్టపతి హమీద్ అన్సారీ పదవి కాలం ఈ ఏడాది ఆగస్టు 11తో ముగియనుంది. ఈ నేప‌థ్యంలో కొత్త అభ్య‌ర్థిపై చ‌ర్చ మొద‌లైంది. రాష్టపతి అభ్యర్థిగా ఉత్తరాదికి చెందిన గవర్నర్ కు అవకాశం దక్కగా...ఉప రాష్ట్ర‌పతి అభ్యర్థిగా దక్షిణాదికి చెందిన మరో గవర్నర్‌ కు అవకాశం కల్పించవచ్చని ప్ర‌చారం మొద‌ల‌యింది. ఈ క్ర‌మంలో ప్రస్తుతం మహారాష్ట్ర - తమిళనాడు రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న చెన్నమనేని విద్యాసాగ‌ర్ రావు పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. ద‌క్షిణాది రాష్ర్టాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించ‌డం, అందులోనూ తెలంగాణపై బీజేపీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన నేప‌థ్యంలో విద్యాసాగ‌ర్ రావు పేరును బీజేపీ ప‌రిశీలించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. తెలంగాణ‌లోని బీజేపీ నేత‌ల‌కు సానుకూల సందేశం పంపేందుకు, ఈ రాష్ర్టానికి తాము ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను తెలియ‌జెప్పేందుకు విద్యాసాగ‌ర్ రావును అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

కాగా, విద్యాసాగ‌ర్ రావుది ప్ర‌స్తుతం రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని మారుపాక గ్రామం. మెట్‌పల్లి నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యే గా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విద్యాసాగ‌ర్ రావు గెలిచారు. ఎంపీగా గెలిచిన స‌మ‌యంలోనే వాజ్ పేయి సర్కార్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. న‌రేంద్ర‌ మోడీ ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌హారాష్ట్రతో పాటుగా త‌మిళ‌నాడు వ్య‌వ‌హారాల‌కు ఇంచార్జీగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వ‌ర్గాలు ఆయ‌న్ను సాగ‌ర్ జీ పేరుతో పిలుస్తుంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/