Begin typing your search above and press return to search.

మోడీ మ‌న‌సులోని మాట‌ను ట్రంప్ చ‌దివేశార‌ట‌!

By:  Tupaki Desk   |   23 Feb 2019 7:13 AM GMT
మోడీ మ‌న‌సులోని మాట‌ను ట్రంప్ చ‌దివేశార‌ట‌!
X
అమెరికా అధ్య‌క్షుల వారు భార‌త్ గురించి.. భార‌త ప్ర‌ధాని గురించి స‌మ‌యం వెచ్చించి మాట్లాడే రోజులు వ‌చ్చేశాయి. భార‌త్ వేసే అడుగుల్ని వైట్ హౌస్ నిశితంగా ప‌రిశీలించటం మామూలే అయినా.. అధ్య‌క్షుల వారు దానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం చూస్తే.. భార‌త్ వేసే అడుగులు ప్ర‌పంచాన్ని అంతో ఇంతో ప్ర‌భావితం చేస్తాయ‌న్న మాటే. పుల్వామా ఉగ్ర‌దాడి అనంత‌రం దాయాది దేశాల మ‌ధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన‌టం ఒక ఎత్తు అయితే.. పాక్ త‌మ‌కు చేసిన ద్రోహానికి అంత‌కంతా బ‌దులు తీర్చుకోవాల‌ని మోడీతో పాటు దేశ ప్ర‌జ‌లంతా బ‌లంగా కోరుకుంటున్నారు.

అదే స‌మ‌యంలో త‌మ మీద ఏదైనా చ‌ర్య తీసుకుంటే.. దాని మీద పోరాడాల‌ని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే పాక్ లో ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున పుల్వామా ఉగ్ర‌దాడి విష‌యంలో పాక్ ను అష్ట‌దిగ్బంధ‌నం చేసేందుకు భార‌త్ ప్ర‌య‌త్నిస్తుంది. ఇప్ప‌టికే నీటి విష‌యంలోనూ.. పాక్ కు వెళ్లే కూర‌గాయ‌ల విష‌యంలోనూ భార‌త్ ఇప్ప‌టికే చ‌ర్య‌లు తీసుకుంది. పాక్ కు వెళ్లే ఎగుమ‌తుల మీద భారీగా ప‌న్ను విధించింది.

ఇదిలా ఉంటే.. పాక్ విష‌యంలో మోడీ స‌ర్కారు ఏదో ఒక‌టి చేయ‌టం ఖాయ‌మ‌న్న భావ‌న‌ను తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయ‌ప‌డ్డారు. పుల్వామా దాడికి ప్ర‌తిగా పాక్ మీద భార‌త్ గ‌ట్టిగానే ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాను ట్రంప్ వ్య‌క్తం చేశారు. భార‌త్.. పాక్ ల మ‌ధ్య ప్ర‌స్తుతం తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని.. ఇరు దేశాల‌తోనూ త‌మ ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లుగా ఆయ‌న పేర్కొన్నారు.

దాయాది దేశాల మ‌ధ్య ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని.. ఇది చాలా ప్ర‌మాద‌క‌రంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఈ ప‌రిస్థితి స‌మ‌సిపోవాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లుగా చెప్పిన ట్రంప్‌.. పుల్వామా ఘ‌ట‌న‌లో దాదాపు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన బాధ‌ను తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.తాజాగా వైట్ హౌస్ లోని ఓవెల్ ఆఫీసులో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న‌..ఏదో ఒక‌టి చేయాల‌ని భార‌త్ గ‌ట్టిగా భావిస్తోందని.. పుల్వామా దాడి కార‌ణంగా భార‌త్‌.. పాక్ ల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌ట్లుగా చెప్పారు.

పాక్ కు తాము ఇచ్చే 1.3 బిలియ‌న్ డాల‌ర్ల‌ను తాను ఆపేసిన విష‌యాన్ని వెల్ల‌డించిన ట్రంప్‌.. స‌రైన స‌మ‌యంలో తాము పాక్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతామ‌ని.. మిగిలిన అమెరికా అధ్య‌క్షుల హ‌యాంల‌లో పాక్ భారీగా లాభం పొందిన వైనాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. తాను మాత్రం అందుకు భిన్నంగా పాక్ కు ఆర్థిక సాయాన్ని నిలిపిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. మోడీ మ‌న‌సులోని మాట‌ను ప్ర‌స్తావిస్తూ.. భార‌త్ దూకుడుకు క‌ళ్లాలు వేయాల‌ని అమెరికా భావిస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.