Begin typing your search above and press return to search.

పవన్ కొరడా దెబ్బలు కదలిక తెచ్చాయా?

By:  Tupaki Desk   |   30 Aug 2016 12:51 PM GMT
పవన్ కొరడా దెబ్బలు కదలిక తెచ్చాయా?
X
పవన్ కల్యాణ్ తిరుపతి సభలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులను చెడామడా నిందించిన తర్వాత.. వారు ఇప్పటిదాకా పెద్దగా ప్రతిస్పందించలేదు. పైగా తన తో చాలా సన్నిహితంగానే ఉండే సీనియర్ నాయకుడు అనే జాలి కూడా లేకుండా.. పవన్ కల్యాణ్ - వెంకయ్యనాయుడు అంతటి సీనియర్ ను పట్టుకుని సభా ముఖంగా నానా మాటలూ అనేశారు. వారి పరువును గంగలో కలిపేశారు. కానీ వెంకయ్యనాయుడు కూడా స్పందించలేదు. పవన్ అన్న మాటల్లో అబద్ధం లేదు గనుక, వాటిని ఖండించడమూ తమకు చేతకాదు, సాధ్యం కాదు గనుక.. ఎవరికి వారు మౌనం పాటించారని అంతా అనుకున్నారు.

అయితే మొత్తానికి మాటల రూపంలో పవన్ కొట్టిన కొరడా దెబ్బలు వెంకయ్యనాయుడులో మాత్రం చలనం తెచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి చాలా సీరియస్ ఎటెంప్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు దూతగా సుజనా చౌదరి - వెంకయ్యనాయుడు ఇద్దరూ కలసి మంగళవారం నాడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తో సుదీర్ఘంగా సమావేశమై ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకతు గరించి చర్చించినట్టు సమాచారం. ప్రధానంగా అరుణ్ జైట్లీనే సైంధవుడిలా హోదాకు అడ్డుపడుతున్నారనేది సీనియర్ నాయకుల్లో ఉన్న భావన. ఈ నేపథ్యంలో ఆయనతో భేటీనే కీలకం కాబోతోంది.

వెంకయ్యనాయుడు తొలిరోజుల్లో , గతంలో విభజన జరిగిన సమయంలో ప్రత్యేక హోదా గురించి పట్టుదలగానే ఉన్నప్పటికీ.. తమ పార్టీ మరియు మోదీ కోటరీకి ఇష్టం లేదని అర్థమయ్యాక.. ఆ గళం మూసేశారు. రాష్ట్రానికి చాలా చేస్తున్నా.. హోదా కంటె ఎక్కవ చేస్తున్నా అనే పాట అందుకున్నారు. అయితే.. ‘‘పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు - ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు’’ అని పవన్ చెప్పిన మాటలు.. ‘‘రాజకీయాల్లో ఇంత సీనియర్ గా అన్నీ అనుభవించారు.. ఇంకా ఏం పట్టుకుపోతారు’’అంటూ వేసిన నిందలు ఆయనలో చలనం తెచ్చినట్లుగా కనిపిస్తోంది.