Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా ఏమీ జిందా తిలిస్మాత్ కాదు

By:  Tupaki Desk   |   9 Oct 2015 11:55 AM GMT
ప్రత్యేక హోదా ఏమీ జిందా తిలిస్మాత్ కాదు
X
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ.. ఓపక్క ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ నిరవధిక దీక్ష చేస్తున్న వేళ.. హైదరాబాద్ కు వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అవసరమే కానీ.. దానితోనే అన్నీ తీరిపోవన్న ఆయన.. అన్నీ సమస్యలకు పరిష్కారం జిందా తిలిస్మాత్ మాదిరి.. ప్రత్యేక హోదాతో అన్నీ సమస్యలు పరిష్కారం కావన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారని.. కానీ వాళ్లెవరూ మాట్లాడకముందే.. తాను మాట్లాడానని.. తాను మాట్లాడే సమయంలో ఎవరూ దాని గురించి మాట్లాడలేదన్న వెంకయ్య.. ప్రత్యేక హోదా ఏపీకి అవసరమేనని.. దానికి వల్ల కొంత మేలు జరుగుతుందే తప్ప.. మొత్తం సమస్యలు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం దేశంలో 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలు అవుతోందని.. అయినప్పటికీ.. ఆయా రాష్ట్రాల వారు తన వద్దకు వచ్చి సాయం కోసం అడుగుతున్నారన్నారు. 2004లో తెలంగాణ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెయ్యి మంది ప్రాణాలు బలి తీసుకున్న తర్వాత తెలంగాణ ఇవ్వటమేమిటని ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని నతిఆయోగ్ పరిశీలిస్తుందని.. దాని స్పందన కోసం ఎదురుచూడకుండా.. ఎలాపడితే అలా మాట్లాడటం ఏమిటంటూ అసహనం ప్రదర్శించారు. ప్రత్యేక హోదా మీద చేస్తున్న విమర్శలన్నీ రాజకీయాలను దృష్టిలోనే ఉంచుకొని అన్న వెంకయ్య.. ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఎవరికి ఉందో ప్రజలకు తెలుసన్నారు.

ప్రత్యేక హోదాతో సమస్యలన్నీ పరిష్కారం కాకున్నా.. కొంత మేలు జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదాకు మిగిలిన అంశాలకు సంబంధం లేదని. .వేటి దారి వాటిదేనన్నారు. ప్రత్యేక హోదాకు.. ట్రిపుల్ ఐఐటీ.. ఎయిమ్స్.. న్యూజోన్.. ఐఐటీ.. ఐఐఎస్ ఆర్ కు.. కరెంటు కొరతకు సంబంధం లేదని తేల్చి చెప్పిన ఆయన.. అన్నీ అవసరమేనన్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా అవసరమే అంటూ.. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నట్లుగా మాట్లాడటం గమనార్హం.