Begin typing your search above and press return to search.

బోయ‌పాటికి కేంద్ర మంత్రుల ప్ర‌శంస‌లు

By:  Tupaki Desk   |   24 Aug 2016 10:26 AM GMT
బోయ‌పాటికి కేంద్ర మంత్రుల ప్ర‌శంస‌లు
X
డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. కేంద్రం మంత్రులు వెంక‌య్య‌నాయ‌డు - సురేష్ ప్ర‌భుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప‌న్నెండేళ్ల‌కు ఒక్క‌సారి వ‌చ్చే కృష్ణా పుష్క‌రాల కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుని వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. అడుగ‌డుగునా అదిరిపోయే సౌక‌ర్యాలు క‌ల్పించారు. యాత్రికుల‌కు అడుగ‌డుగునా స‌క‌ల సౌక‌ర్యాలు క‌లిగించారు. వారు స్నానం చేసి ఇంటికి తిరిగి వెళ్లేవ‌ర‌కు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని పుష్క‌రాల‌ను స‌క్సెస్ చేశారు. అయితే, ఇదంతా ఒక ఎత్త‌యితే - పుష్క‌రాల అస‌లు క‌ల‌రింగ్ అంతా ప‌విత్ర సంగ‌మ ప్రాంతంలోనే ఉండ‌డం ఇక్క‌డ విశేషం.

దాదాపు ఎక్క‌డెక్క‌డ నుంచో విజ‌య‌వాడలో జ‌రిగిన పుష్క‌రాల‌కు వ‌చ్చిన యాత్రికులు అక్క‌డి నుంచి దాదాపు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఇబ్ర‌హీంప‌ట్నం స‌మీపంలోని ప‌విత్ర సంగ‌మం ఘాట్‌ లో ఏర్పాటు చేసిన కృష్ణా పుష్క‌ర హార‌తిని ద‌ర్శించేందుకు క్యూక‌ట్టారు. ఈ హార‌తి కార్య‌క్ర‌మాన్ని పూర్తిగా త‌న భుజాల‌పై వేసుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి దానిని స‌క్సెస్ చేసేందుకు ఎంతో శ్ర‌మించార‌న‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. కృష్ణా - గోదావ‌రి న‌దులు క‌లిసే సంగ‌మ ప్రాంతంలో న‌దికి మ‌ధ్య‌లో ఎనిమిది బోట్ల‌ను ఒక‌చోట చేర్చి వేదిక ఏర్పాటు చేసి అద్భుత‌మైన రీతిలో దానిని తీర్చి దిద్ది.. కృష్ణ‌మ్మ‌కు తొమ్మిది రకాల హారతులు ఇచ్చేలా ఆయ‌న వినూత్నంగా తీర్చిదిద్దారు.

సాయంత్రం ఖ‌చ్చితంగా ఏడు గంట‌ల‌య్యేస‌రికి ప‌విత్ర సంగ‌మ ప్రాంతం పూర్తిగా యాత్రికుల‌తో నిండిపోయిందంటే బోయ‌పాటి ప్లాన్ వ‌ల్లేన‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. దీనికోసం ఆయ‌న పుష్క‌రాలు జ‌రిగిన 12 రోజులు విజ‌య‌వాడ‌లోనే ఉండిపోయి అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండి నిత్యం ఓ వెరైటీగా దీనిని తీర్చిదిద్దారు. ఈ మొత్తం హార‌తుల కార్య‌క్ర‌మానికి వాయిస్ ఓవ‌ర్‌ గా డైలాగ్ కింగ్ సాయికుమార్ వాయిస్ వాడుకోవ‌డం మ‌రింత క‌ల‌ర్‌ పుల్‌ ను ఇచ్చింది. ఇక‌, చివ‌రిరోజైన మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం మ‌రింత‌గా వ‌న్నెతెచ్చింది.

పుష్క‌రాల ఆఖ‌రిరోజు హార‌తి కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ బోయ‌పాటి చేసిన అద్భుతానికి మంత్ర‌ముగ్దులైపోయారు. హార‌తి ముగిశాక బ్యాక్ గ్రౌండ్‌ లో బాణాసంచా పేలుళ్లు ప్ర‌తి ఒక్క‌రినీ క‌ట్టిప‌డేశాయి. దీంతో ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కేంద్రం మంత్రులు వెంక‌య్య‌ - సురేష్ ప్ర‌భులు.. బోయ‌పాటిని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. అదేవిధంగా బోయ‌పాటి కృషిని మొద‌టి నుంచి ప్ర‌శంసిస్తూ వ‌చ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి మంగ‌ళ‌వారం ఆయ‌న కృషిని కొనియాడారు. అక్క‌డే బోయ‌పాటిని శాలువాక‌ప్పి మొమెంటో అందించి ఘ‌నంగా స‌త్క‌రించారు.