Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు మొనగాడితనాన్ని చెప్పిన వెంకయ్య

By:  Tupaki Desk   |   25 May 2016 4:41 AM GMT
మోడీ సర్కారు మొనగాడితనాన్ని చెప్పిన వెంకయ్య
X
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ రెండేళ్లలో ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మార్పు ప్రజల అనుభవంలోకి రాకున్నా.. తామెంత కష్టపడింది.. ఎంతగా శ్రమించామన్న విషయాన్ని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు లెక్కలు చెప్పుకొచ్చారు. గడిచిన రెండేళ్లలో తమ సర్కారు ఎంతగా కష్టపడుతుందన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసిన ఆయన.. పదేళ్లతో పోలిస్తే.. రెండేళ్ల వ్యవధిలో పెరిగిన పార్లమెంటు సమావేశాల సంఖ్య.. ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు.

మోడీ సర్కారు అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలో లోక్ సభలో 96.. రాజ్యసభలో 83 బిల్లులు ఆమోదం పొందినట్లుగా వెంకయ్య చెప్పారు. పదేళ్లతో పోలిస్తే పార్లమెంటు పని తీరు బాగా మెరుగైనట్లు వెల్లడించారు. రెండేళ్ల వ్యవధిలో పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తం 101 బిల్లులు ప్రవేశ పెట్టినట్లుగా చెప్పిన వెంకయ్య.. లోక్ సభలో 96 బిల్లులు ఆమోదం పొందగా.. రాజ్యసభలో 83 బిల్లులు ఆమోదం తెలిపిందన్నారు. రాజ్యసభలో పెండింగ్ లో ఉన్న బిల్లుల అంశాన్ని రాజ్యసభ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా వెంకయ్య వెల్లడించారు.

ఇక.. పార్లమెంటు సమావేశాల విషయానికి వస్తే.. రెండేళ్లలో లోక్ సభ 149 సమావేశాలు నిర్వహించగా.. రాజ్యసభ 143 సమావేశాల్ని నిర్వహించిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జీఎస్ టీ బిల్లు ఆమోదానికి తగినంత సంఖ్యాబలం ప్రభుత్వానికి ఉన్నట్లుగా వెంకయ్య చెప్పటం గమనార్హం. మరి.. రానున్న సమావేశాల్లో జీఎస్ టీ బిల్లుకు ఆమోద ముద్ర పడేలా చేస్తారా? అన్నది చూడాలి.