కేసీఆర్ లోని కొత్త కోణం వెంకయ్యకు నచ్చేసింది

Wed Sep 13 2017 13:11:43 GMT+0530 (IST)


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులోని కొత్త కోణం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు భలే నచ్చేసింది. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు భాష పరిరక్షణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాదినుంచి అన్ని విద్యాసంస్థలు ఒకటో తరగతి మొదలుకుని 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టంచేశారు. అటువంటి విద్యాసంస్థలకే రాష్ట్రంలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మరో కీలక నిర్ణయంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ - ప్రైవేటు సంస్థలు తమ బోర్డులను తెలుగులో రాయాలని ఆదేశించారు. ఈ నిర్ణయమే వెంకయ్యకు నచ్చేసింది.ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేసిన సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ వెంకయ్య ట్వీట్ చేశారు. ఇతర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాతృభాషకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా అమలు చేస్తుందని ఆశిస్తున్నానని వెంకయ్య పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారు. దేశ - విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు - భాషా పండితులు - అవధానులు - కవులు - కళాకారులు - రచయితలు - కళాకారులను మహాసభలకు ప్రభుత్వం తరఫున ఆహ్వానించాలని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి అతిథులను ఆహ్వానించడానికి ప్రపంచ తెలుగు మహాసభల ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. మహాసభలను హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు జరుపాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా జరిగే ఈ మహాసభల ప్రారంభ - ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ - ప్రధాని నరేంద్రమోదీ - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను ఆహ్వానించాలని నిర్ణయించారు. మహాసభల సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.