ఉషాపతి వెంకయ్యే..ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి

Mon Jul 17 2017 20:43:09 GMT+0530 (IST)

``ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నా పేరు వినిపిస్తూ ఉండవచ్చు. కానీ నేను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాదల్చుకోలేదు. ఉప రాష్ట్రపతి కంటే ఉషాపతిగా ఉండటమే నాకిష్టం`` అని బీజేపీ సీనియర్ నేత - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదేపదే ఉపరాష్ట్రపతి పదవిపై అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ ఆయన పేరే ఖరారైంది! వెంకయ్య నాయుడు భార్యపేరు ఉష. తన భార్యపేరు ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి కంటే ఉషాపతే ఇష్టమని పలు సందర్భాల్లో అన్నారు. అయితే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు ఖరారు చేశారు.

పార్లమెంటరీ బోర్డులో తీసుకున్న నిర్ణయం గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సహా అమిత్ షా ఉప రాష్ట్రపతి అభ్యర్థి  వెంకయ్యకు అభినందనలు తెలియజేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నామినేషన్ వేయనున్నారు. దీంతో కేంద్రమంత్రి వెంకయ్య తన పదవులకు రాజీనామా చేయనున్నారు. దక్షిణాది నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడమే వెంకయ్య అభ్యర్థిత్వానికి కారణమైంది. వెంకయ్య తొలుత ఉపరాష్ట్రపతి పదవి పట్ల విముఖత చూపించినప్పటికీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. విపక్షాలు ఇప్పటికే గోపాలకృష్ణ గాంధీని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా వెంకయ్యనాయుడు 1996 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. 1999లో వాజ్‌పేయీ మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1998 - 2004 - 2010లో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2014లో నరేంద్రమోడీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి - సమాచార శాఖ బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధిలో వెంకయ్యనాయుడు కీలక పాత్ర పోషించారు. పార్టీకి చెందిన క్లిష్ట సందర్భాల్లో తనదైన శైలిలో స్పందించి వివాద తీవ్రతను తగ్గించారు.