Begin typing your search above and press return to search.

ఇదే ఊపులో వెంక‌య్య‌జీ గెలిచేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   20 July 2017 1:12 PM GMT
ఇదే ఊపులో వెంక‌య్య‌జీ గెలిచేస్తార‌ట‌
X
ముందు నుంచి అంద‌రూ ఊహించిన‌ట్లే బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ ప‌క్షాల రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్‌ నాథ్ కోవింద్ భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌య్యారు. 65.65 శాతం ఓట్ల‌తో కాంగ్రెస్ సార‌థ్యంలోని విప‌క్ష కూటమి అభ్య‌ర్థి మీరాకుమార్‌ పై బంప‌ర్ మెజార్టీతో ఆయ‌న విజ‌యం సాధించారు. మీరా కుమార్ 34.35 శాతం ఓట్ల‌తో స‌రిపెట్టుకున్నారు. ప్ర‌థ‌మ పౌరుడి ఎంపిక పూర్త‌యిన నేప‌థ్యంలో ఇప్పుడు రాజ‌కీయ‌పార్టీలు స‌హా దేశం చూపు ఉప‌రాష్ట్రప‌తి ఎన్నికపై ప‌డింది. అందులోనూ తెలుగువారికి ఈ పోటీపై ప్ర‌త్యేక న‌జ‌ర్ ప‌డింది ఎందుకంటే...ఈ ప‌ద‌వికి పోటీప‌డుతున్న‌ది తెలుగుగ‌డ్డ‌పై ప్ర‌ముఖుడైన బీజేపీ అగ్ర‌నేత‌ - ఇటీవ‌లే కేంద్ర మంత్రి ప‌దవికి రాజీనామా చేసిన‌ వెంక‌య్య‌నాయుడు.

రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రప‌తిగా బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించిన‌ట్లే... వెంక‌య్యనాయుడు కూడా భారీ మెజార్టీతో విజ‌య‌తీరానికి చేరుకుంటార‌ని జాతీయ రాజ‌కీయాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న‌వారు విశ్లేషిస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతోనే వెంకయ్యనాయుడు విజయం దాదాపు ఖాయమైపోయింద‌ని...ఎన్నిక ఇక లాంఛనం మాత్రమేన‌ని చెప్తున్నారు. లోక్‌ సభ - రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుని ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు కనుక సంఖ్యాపరంగా లోక్‌ సభలో ఎన్డీఏకు మెజారిటీ ఉంది. రాజ్యసభలో సైతం ఆ మేరకు మెజారిటీని కూడగట్టుకుంది. ఉభయ సభల్లోని 790 మంది సభ్యుల్లో ముగ్గురు ఇటీవల మరణించడంతో మిగిలిన 787 మందిలో (నామినేటెడ్ సభ్యులతో కలుపుకుని) వెంకయ్యనాయుడికి గరిష్ఠంగా 550కంటే ఎక్కువ మంది ఓట్లు లభించే అవకాశం ఉంది. యూపీఏ కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా,కాదు.. కాదంటూనే ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య నాయుడు ఖ‌రారు అయిన సంగ‌తి తెలిసిందే. ఉపరాష్ట్రపతి పదవికి తన పేరు పరిశీలనలో ఉందన్న వార్తలపై వెంకయ్య తనదైన శైలిలోనే స్పందించారు. రాష్ట్రపతి కాదు.. ఉపరాష్ట్రపతి కాదు.. నేను ఉషాపతిని మాత్రమే (ఆయన సతీమణి పేరు ఉష) అని చమత్కరించి దాటవేశారు. కానీ చివరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు వచ్చారు.