Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌ కు వెంక‌య్య నాయుడు వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   23 July 2017 5:26 PM GMT
పాకిస్థాన్‌ కు వెంక‌య్య నాయుడు వార్నింగ్‌!
X
బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఎన్డీఏ ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి వెంకయ్య‌నాయుడు పాకిస్థాన్‌ కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో ప్ర‌తి ఏటా కార్గిల్ అమ‌ర‌వీరుల స్మార‌కార్థం నిర్వ‌హిస్తున్న కార్గిల్ ప‌రాక్ర‌మ్ ప‌రేడ్‌ లో పాల్గొన్న వెంక‌య్య ఈ సంద‌ర్భంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ``పొరుగు దేశాల‌కు విశ్రాంతి లేకుండా చేయాల‌ని పాక్ భావిస్తున్న‌ది. కానీ ఆ దేశం ఒక్క విష‌యం గుర్తుంచుకోవాలి. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు భార‌త్ అంతా ఏక‌మై ఉంది. ఎలాంటి చ‌ర్య‌ల‌నైనా తిప్పికొడ‌తాం. 1971లో ఏం జరిగిందో పాక్ గుర్తుంచుకోవాలి`` అని వెంక‌య్యనాయుడు స్ప‌ష్ట‌మైన హెచ్చ‌రిక చేశారు.

ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌య‌మిస్తున్న దేశాల జాబితాలో పాకిస్థాన్‌ ను కూడా అమెరికా చేర్చిన సంద‌ర్భాన్ని గుర్తు చేస్తూ ఉగ్ర‌వాదుల‌కు మ‌ద్ద‌తివ్వ‌డాన్ని ఆపేయాల‌ని పాకిస్థాన్‌కు వెంక‌య్య‌నాయుడు స్ప‌ష్టంచేశారు. జైషే మ‌హ్మ‌ద్‌ - ల‌ష్క‌రే తోయిబాలాంటి ఉగ్ర‌వాద సంస్థ‌లు పాక్‌లోనే శిక్ష‌ణ పొందుతున్నాయ‌ని, అక్క‌డి నుంచే నిధులు స‌మీక‌రిస్తున్నాయ‌ని అమెరికా గుర్తించిన‌ట్లు వెంక‌య్య తెలిపారు. కాగా, 1971లో జ‌రిగిన 13 రోజుల యుద్ధంలో పాక్ ఘోరంగా దెబ్బ తింది. పాకిస్థాన్ చెర నుంచి తూర్పు పాకిస్థాన్‌కు విముక్తి క‌ల్పించ‌డంలో భార‌త్ విజ‌య‌వంత‌మైంది. ఆ తూర్పు పాకిస్థానే ఇప్పుడు బంగ్లాదేశ్ అయిన విష‌యం తెలిసిందే.

ఇదిలాఉండ‌గా...ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం ఎన్డీఏ త‌ర‌ఫున వెంక‌య్య‌నాయుడు బ‌రిలో దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ద‌వి కోసం ఆగ‌స్ట్ 5న ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది. ఈ ఎన్నిక‌ల్లో వెంక‌య్య‌కు సునాయాస విజ‌య‌వం ఖాయ‌మ‌ని అంటున్నారు.