Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రికే వెంకయ్య క్లాస్ పీకారే... రీజనేంటంటే?

By:  Tupaki Desk   |   19 July 2019 12:45 PM GMT
కేంద్ర మంత్రికే వెంకయ్య క్లాస్ పీకారే... రీజనేంటంటే?
X
చట్టసభకు ఎన్నికై... సభా సమావేశాలకు హాజరు కాకుండా ఇంటి పట్టునే కూర్చోవడమో, లేదంటే సొంత వ్యాపారాలు చూసుకోవడమో ఇకపై కుదరదంటే కుదరదు. ప్రజల చేత వారి ప్రతినిధులుగా ఎన్నికయ్యాక కూడా వారి సమస్యలను సభలో లేవనెత్తి, వాటి పరిష్కారం కోసం కృషి చేయకుండా ఇతర వ్యాపకాల్లో మునగడం అంతకన్నా కుదరదు. ఎందుకంటే... సభకు రాకుండా ఏం చేస్తున్నారంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తాజాగా రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా ఎంపీలు, మంత్రులు అని కూడా చూడకుండా చెడామడా వాయిస్తుంటే... సభకు డుమ్మా కొట్టడం కుదరదు కదా.

నిజమే... స్వయంగా ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి స్థాయి నేతలు క్లాస్ పీకుతుంటే సభకు గైర్హాజరు కావడం సాధ్యం కాదు కదా. చట్టసభలకు సభ్యులుగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సభా సమావేశాలకు హాజరు కాకుండా ఉండేంతగా ఏం పనులు ఉంటాయి? ఏమీ ఉండవనే చెప్పాలి. అనారోగ్య కారణాల వరకైతే ఓకే గానీ... సభకు డుమ్మా కొట్టడం ఇకపై ఏ చట్ట సభ సభ్యుడికి కూడా కుదరదనే చెప్పాలి. ఈ దిశగా బీజేపీ పార్లమెంటు సభ్యులకు నిన్న గాక మొన్న నరేంద్ర మోదీ ఇదే విషయంపై పెద్ద క్లాసే తీసుకున్నారు. తాజాగా వెంకయ్య వంతు వచ్చింది. మోదీ ఎంపీలను ఉద్దేశించి క్లాస్ తీసుకుంటే... వెంకయ్య ఏకంగా మంత్రులకే క్లాస్ తీసుకున్నారు.

శుక్రవారం నాటి రాజ్యసభ సమావేశాల్లో భాగంగా చోటుచేసుకున్న ఘటనలో వెంకయ్య ఏకంగా కేంద్ర పశుసంవర్ధక శాఖా మంత్రి సంజీవ్ కుమార్‌ కు క్లాస్ పీకారు. అంది కూడా సభలోనే వెంకయ్య క్లాస్ తీసుకోవడంతో కేంద్ర మంత్రి చాలా ఇబ్బందే పడ్డారని చెప్పక తప్పదు. సంజీవ్ కుమార్ ఈ మధ్య సభకు సరిగ్గా హాజరు కావడం లేద. సభాధ్యక్ష స్థానంలో ఉన్న వెంకయ్య మంత్రి పేరు పిలిచే సమయంలో సంజీవ్ కుమార్ సభలో లేరట. దీంతో వెంకయ్యకు యనిజంగానే చిర్రెత్తుకొచ్చింది. అసలే ఉత్తమ పార్లమెంటేరియన్ గా పలుమార్లు అవార్డులు అందుకున్న వెంకయ్య... సభలో సభ్యుడిగా ఉండటమే కాకుండా మంత్రిగా ఉన్న సంజీవ్ కుమార్ సమయానికి సభలో కనిపించకపోయే సరికి చిర్రెత్తుకు రావడం సహజమే కదా.

అందుకే సభలోనే అందరి ముందే వెంకయ్య సదరు మంత్రికి క్లాస్ పీకారు. మరోసారి ఈ పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఆ మంత్రిని హెచ్చరించారు. ‘మంత్రి గారు... మొన్న తమరి పేరు ఎజెండాలో ఉంది. దీంతో తమరి పేరును సభలో పిలిచాం, అయితే తమరు సభలో లేరు... భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి’ అని చైర్మన్ వెంకయ్య ఆ మంత్రికి కాస్తంత గట్టి వార్నింగే ఇచ్చారట. అందరి ముందు మంత్రి హోదాలో ఉన్న తనను పట్టుకుని వెంకయ్య క్లాస్ పీకేసరికి చిన్నబుచ్చుకున్న సంజీవ్ కుమార్.. ఇకపై ఎప్పుడు అలా జరగదని అక్కడికక్కడే సమాధానం ఇవ్వక తప్పలేదు.