Begin typing your search above and press return to search.

వెంక‌య్య‌లో కొత్త కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది

By:  Tupaki Desk   |   16 Jun 2018 5:26 AM GMT
వెంక‌య్య‌లో కొత్త కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది
X
రాజ్యాంగ‌ప‌ర‌మైన ప‌ద‌వుల్లోకి వెళ్లిన వారు ప్ర‌జాజీవితానికి దూరంగా ఉండ‌టం మామూలే. దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించే వారు కొంద‌రు అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటారు. అలాంటి కోవ‌కే చెందుతారు ఉప‌రాష్ట్రప‌తి కుర్చీలో ఉన్న వెంక‌య్య‌నాయుడు. సుదీర్ఘ ప్ర‌జా జీవితాన్ని చూసిన వెంక‌య్య‌కు ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విలో ఊహించ‌లేం. కానీ.. కోరి వ‌చ్చిన ప‌ద‌విని కాద‌న‌లేక ఆయ‌న ఒప్పుకున్న‌ట్లు చెబుతారు.

ఉప‌రాష్ట్రప‌తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న య‌మా చురుగ్గా ఉంటారు. నిత్యం ఏదో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతూ ప్ర‌జ‌ల మ‌ధ్య త‌ర‌చూ క‌నిపిస్తుంటారు. తాజాగా ఆయ‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాని కొత్త యాంగిల్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న‌ను ఆహ్వానించిన వారి ఆహ్వానాన్ని మ‌న్నించ‌ట‌మే కాదు.. ఒక‌సారి క‌మిట్ మెంట్ ఇచ్చిన త‌ర్వాత ఏం జ‌రిగినా.. ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నా స‌రే.. మాట ఇచ్చిన కార్య‌క్ర‌మానికి వెళ్లాల్సిందేన‌న్న ప‌ట్టుద‌ల వెంక‌య్య‌లో చాలా ఎక్కువ‌న్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. సిక్కింల‌లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతాన‌ని వెంక‌య్య మాట ఇచ్చారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఆయ‌న ప‌శ్చిమ‌బెంగాల్ లోని సిలిగురి బాగ్ డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. భారీ వ‌ర్షంతోపాటు.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది. ఇలాంటి వేళ‌.. మారుమూల‌న ఉండే ఈశాన్య రాష్ట్రాల‌కు చేరుకోవ‌టం రిస్క్ అన్న అభిప్రాయాన్ని వెంక‌య్య భ‌ద్ర‌తాధికారులు సూచించారు.

అందుకు నో చెప్పిన వెంక‌య్య ప్ర‌తికూల వాతావ‌ర‌ణాన్ని అధిగ‌మిస్తూ ప్ర‌యాణం చేయాల్సిందేన‌ని చెప్పి.. ముందుగా వెళ్లాల్సిన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న అసోంలోని లీలాబ‌రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్క‌డ కూడా ప‌రిస్థితి ఏ మాత్రం బాగోలేదు. భారీ వ‌ర్షంతో పాటు.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. అక్క‌డి నుంచి వాయు మార్గంలో ప్ర‌యాణించ‌లేని ప‌రిస్థితి. మ‌ళ్లీ ఢిల్లీకి తిరిగి వెళ‌దామంటూ భ‌ద్ర‌తాసిబ్బంది సూచ‌న చేసింది.

దీనికి అంగీక‌రించ‌ని వెంక‌య్య‌.. రోడ్డు మార్గంలో గ‌మ్య‌స్థానానికి చేరుకుందామ‌న్న ప్ర‌తిపాద‌న చేశారు. రోడ్డు మార్గంలో జ‌ర్నీ అంటే.. ఒళ్లు అద‌ర‌కుండా ఉండే నేష‌న‌ల్ హైవే అనుకుంటే త‌ప్పులోకాలేసిన‌ట్లే. వీవీఐపీల ప్ర‌యాణానికి ఏ మాత్రం సూట్ కాని గ‌తుకుల రోడ్డు మీద గంట‌ల పాటు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. అదే విష‌యాన్ని వెంక‌య్య దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఏం ఫ‌ర్లేద‌న్న ఆయ‌న‌.. రోడ్డు ప్ర‌యాణంలో వెళ్ల‌టానికి సిద్ధ‌మ‌య్యారు.

దీంతో.. అధికారులు అందుకు త‌గ్గ‌ట్లు ఏర్పాట్లు చేశారు. గ‌తుకుల రోడ్ల మీద.. ఎగుడుదిగుడు ర‌హ‌దారుల్లో దాదాపు రెండు గంట‌ల‌కు పైగా ప్ర‌యాణం చేసిన వెంక‌య్య‌.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో తాను ఇచ్చిన మాట‌కు త‌గ్గ‌ట్లే గ‌మ్య‌స్థానానికి చేరుకున్నారు. ఇంత సుదీర్ఘ ప్ర‌యాణానికి ఏ మాత్రం అలిసిపోని ఆయ‌న‌.. ఉత్సాహంగా త‌న‌ను రిసీవ్ చేసుకోవ‌టానికి వ‌చ్చిన రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌.. ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడ‌టాన్ని చూసిన వారంతా వెంక‌య్య ఎన‌ర్జీని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ప్రోగ్రామ్ ఏదైనా స‌రే.. ఒక‌సారి క‌మిట్ మెంట్ ఇచ్చిన త‌ర్వాత ముందుకు వెళ్లాల్సిందే త‌ప్ప వెన‌క్కి వెళ్లే ప్ర‌స‌క్తే ఉండ‌ద‌న్న మాట త‌న స‌న్నిహితుల‌తో వెంక‌య్య చెప్పటం క‌నిపిస్తుంది. ఇదే ప‌ట్టుద‌ల‌.. మొండిత‌నం ఏపీ ప్ర‌త్యేక‌హోదా విష‌యంలోనూ వ్య‌వ‌హ‌రించి ఉంటే బాగుండేది క‌దూ?