చంద్రుళ్లను డిఫెన్స్ లో పడేసిన వెంకయ్య

Sun Aug 27 2017 15:32:48 GMT+0530 (IST)

ఇంగువ కట్టిన గుడ్డకి వాసన పోదంటారు. ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన వెంకయ్య నాయుడు పరిస్థితి కూడా ఇంగువ గుడ్డ మాదిరి తయారైనట్లుగా ఉంది. చిన్నతనంలోనే రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు దశాబ్దాల తరబడి నిత్యం రాజకీయం చేసే ఆయన్ను రాజకీయాలకు అతీతంగా చూడాలంటే చూడలేం. ఆ మాటకు వస్తే.. తనను రాజకీయాలకు అతీతంగా ఎవరైనా చూసినా వెంకయ్య జీర్ణించుకోలేరేమో?బాధ్యతల బంధీగా.. ప్రోటోకాల్ పరిమితుల చట్రంలో ఇరుక్కున్న విషయాన్ని పదే పదే వెంకయ్య చెప్పటమే కాదు.. తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లుగా పదే పదే చెప్పినా.. ఆయన మాత్రం తనకు సహజసిద్ధంగా అబ్బిన రాజకీయాన్ని వదిలిపెట్టలేదన్న భావన తాజాగా ఆయన ప్రసంగాన్ని చూస్తే అర్థం కాక మానదు.

దేశంలో అత్యున్నత పదవుల్లో రెండోదైన ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన వెంకయ్య.. తానిక రాజకీయాల గురించి మాట్లాడనన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన సందర్భంలోనే ప్రస్తావించారు. కానీ.. తాజాగా ఆయన వ్యాఖ్యల్ని చూస్తే.. ఆయన చెప్పిన గీతను దాటినట్లుగా కనిపించక మానదు.

ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తన సొంత రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వెంకయ్యకు ఏపీ సీఎం వినూత్న రీతిలో స్వాగత సత్కారాల్ని ఏర్పాటు చేశారు. గ్రాండ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. భారీతనం కోసం పెద్ద ఎత్తున నిధుల్ని ఖర్చు పెట్టే అలవాటు ఉన్న బాబు.. వెంకయ్య మనసు దోచేలా ఆయనకు స్వాగత సత్కారాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన పౌరసన్మానంలో మాట్లాడిన వెంకయ్య నోటి వెంట రాజకీయ వ్యాఖ్యలు అలవోకగా వెలువడ్డాయని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ తరచూ కలుసుకోవాలని.. మాట్లాడుకోవాలని.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు మాటల్ని అంత తేలిగ్గా తీసి పారేయలేనిది. ఎందుకంటే.. ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్య ఈ మాటల్ని కోట్లాది మంది ప్రజల ముందు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. విందుకు పిలిచి మరీ చెప్పొచ్చు. లేదంటే.. ఉప రాష్ట్రపతి హోదా కంటే ముందే కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఇద్దరి మధ్య రాజీ పంచాయితీ ఒకటి ఏర్పాటు చేసి.. లెక్కల్ని ఒక కొలిక్కి తీసుకురావొచ్చు. కేంద్రమంత్రిగా.. ఏపీ ప్రజలకు అండగా ఉండే క్రమంలో ఇద్దరు చంద్రుళ్లను ఢిల్లీకి పిలిపించి మరీ.. ఇద్దరూ ఎలా ఉండాలన్న విషయంపై క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు. కానీ.. వీటన్నింటికి భిన్నంగా ఇరువురు చంద్రుళ్లు తరచూ కలుసుకొని మాట్లాడుకోవాలని.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యలను పరిష్కరించుకోవాలని వెంకయ్య సూచించటం గమనార్హం.

ఇదంతా ఒక బహిరంగ వేదిక మీదా.. అది కూడా పౌరసన్మానం వేదిక మీదనే ఎందుకు ప్రస్తావించినట్లు? అన్నది అసలు ప్రశ్న. ఏపీ సర్కారు చేసిన పౌరసన్మానానికి ఆరేడు రోజుల ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వెంకయ్యకు పౌరసన్మానం చేపట్టారు. ఆ సందర్భంలోనూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ మాట్లాడుకోవాలని చెప్పినా.. ఆ విషయాన్ని జస్ట్ ప్రస్తావించారు. కానీ.. విజయవాడలో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించటంతో పాటు వరుస సూచనలు.. సలహాలు ఇవ్వటం చూస్తే.. ఈ అంశంపై వెంకయ్య వ్యూహాత్మకంగానే మాట్లాడినట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ సన్మానం రోజున పాసింగ్ కామెంట్ గా చేసిన ఇద్దరు చంద్రుళ్ల మీటింగ్ ముచ్చట విజయవాడలో జరిగిన సమావేశంలో మాత్రం డిటైల్డ్ గా మాట్లాడటం.. సమస్యల్ని శాంతియుతంగా.. చర్చల రూపంలో మాట్లాడుకోవటం.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని కోరటం చూస్తే.. ఇవన్నీ ఇద్దరు చంద్రుళ్లలో లేవన్న వాదన వినిపిస్తోంది. నాలుగు గోడల మధ్య చెప్పినా వినని వారికి.. బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయటం ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్యనున్న సమస్యల పంచాయితీల పరిష్కారానికి ఇద్దరుచంద్రుళ్లు నడుం బిగించాలన్న సందేశాన్ని వెంకయ్య చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య పలు పంచాయితీలు ఉన్నా.. వాటి సాధన విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు పెద్దగా పట్టటం లేదన్న విషయాన్ని వెంకయ్య తన మాటలతో చెప్పకనే చెప్పినట్లైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.