Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు వెంక‌య్య నో చెప్పార‌ట‌

By:  Tupaki Desk   |   28 July 2017 7:33 AM GMT
ఎన్టీఆర్ కు వెంక‌య్య నో చెప్పార‌ట‌
X
మామూలుగా అయితే వీకెండ్ అయితే చాలు వెంక‌య్య‌నాయుడికి అయితే హైద‌రాబాద్ కానీ లేదంటే ఏపీ కానీ గుర్తుకు వ‌స్తుంది. కానీ.. ఈసారి శుక్ర‌వార‌మే ఆయ‌న హైద‌రాబాద్‌ కు వ‌చ్చేశారు. వీకెండ్‌ కు కాస్త ముందే రావ‌టానికి కార‌ణం లేక‌పోలేదు. మీడియా మొఘ‌ల్ రామోజీరావు ఇంట జ‌రుగుతున్న ఆయ‌న మ‌న‌మ‌రాలి పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు వీలుగా వెంక‌య్య తాజా విజిట్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. రామోజీకి స‌న్నిహితుడైన వెంక‌య్య పెళ్లికి ఆ మాత్రం ముందుగా రాకుండా ఉండ‌రు క‌దా.

ఇక‌.. త‌న కోసం ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినంద‌న కార్య‌క్ర‌మంలో వెంక‌య్య ప్ర‌సంగించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోటి నుంచి ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పార్టీని త‌ల్లిగా భావించే త‌న‌కు.. అదే పార్టీ నుంచి ప‌ర్మినెంట్ గా బ‌య‌ట‌కు రావాల్సిన సంద‌ర్భం ఏర్ప‌డ‌టంతో తాను క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాయ‌న్నారు (రాష్ట్రప‌తి.. ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వులు చేప‌ట్టిన వారు పార్టీల నుంచి దూరంగా ఉంటారు) ఆ స‌మ‌యంలో త‌న‌ను ప్ర‌ధాని మోడీ ఓదార్చార‌ని చెప్పారు. ప‌ద‌వుల్ని తాను ఎప్పుడూ కోరుకోలేద‌ని.. అవే వెతుక్కుంటూ వ‌చ్చాయ‌న్నారు.

చాలా చిన్న‌త‌నంలోనే పార్టీ త‌న‌ను రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడిగా చేసింద‌ని.. కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు పార్టీ జాతీయ అధ్య‌క్షుడ్ని చేసింద‌న్న విష‌యాల్ని గుర్తు చేసుకున్నారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోనూ త‌న స‌త్తా చాటిన విష‌యాన్ని గుర్తు చేస్తూ.. 1983 టీడీపీ ప్ర‌భంజ‌నంలోనూ తాను ఘ‌న విజ‌యం సాధించాన‌ని.. ఆ త‌ర్వాత త‌మ పార్టీలోకి వ‌స్తే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ఎన్టీఆర్ ఆహ్వానించార‌న్నారు. అయితే.. తాను ఆ ఆఫ‌ర్‌ ను తిర‌స్క‌రించిన‌ట్లుగా చెప్పారు. 2019లో మోడీని మ‌రోసారి ప్ర‌ధాని అయ్యాక 2020లో తాను రాజ‌కీయాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి సామాజిక సేవ‌లో నిమ‌గ్నం కావాల‌ని అనుకున్నాన‌ని చెప్పారు.

త‌న కుమారుడు చేసే వ్యాపారాల గురించి తాను ఎప్పుడూ ఆరా తీయ‌లేద‌ని.. త‌న ప‌ద‌వుల్ని అడ్డం పెట్టుకొని వారు ల‌బ్థి పొందలేద‌న్నారు. వెంక‌య్య మాట‌లు చూసిన‌ప్పుడు అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే. ఒక పార్టీని న‌మ్ముకొని.. దాని మీదే ప‌ని చేసిన వారికి ఫ‌లితం త‌ప్ప‌క ల‌భిస్తుంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఒక‌వేళ మంత్రి ప‌ద‌వి కోసం ఎన్టీఆర్ ఆఫ‌ర్ ను కానీ ఓకే అనేసి ఉంటే.. ఈ రోజు వెంక‌య్య ఎక్క‌డ ఉండేవారో క‌దా?