Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు, కేసీఆర్‌ కు వెంక‌య్య సూప‌ర్ ఆఫ‌ర్‌

By:  Tupaki Desk   |   28 Sep 2016 11:01 AM GMT
చంద్ర‌బాబు, కేసీఆర్‌ కు వెంక‌య్య సూప‌ర్ ఆఫ‌ర్‌
X
వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మైన ఏపీ - తెలంగాణ‌కు కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. సీఎంలు కేసీఆర్‌ - చంద్ర‌బాబుల‌కు మంచి మంచి స‌ల‌హాలు ఇచ్చారు. వ‌ర‌ద బాధితుల‌ను ఎలా ఆదుకోవాలో దిశానిర్దేశం చేశారు. నైరుతి రుతు ప‌వ‌నాలు - బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌న్ దెబ్బ‌కి ఏపీ - తెలంగాణ‌లో ఆకాశం చిల్లులు ప‌డిందా అన్న‌ట్టుగా వ‌ర‌స‌పెట్టి నాలుగు రోజులు వ‌ర్షాలు దుమ్మురేపాయి. దీంతో ఏపీలో తూర్పు - ప‌శ్చిమ‌గోదావ‌రి - గుంటూరు జిల్లాలు అత‌లాకుతలం అయిపోయాయి. గుంటూరులో రికార్డు వ‌ర్షం కురిసి ప‌ల్నాడు రూపురేఖ‌లు సైతం మారిపోయాయి. అనేక మంది నిరాశ్ర‌యుల‌య్యారు. వ‌రి - ప‌త్తి - మిర‌ప రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఇళ్లు కూలిపోయి అనేక మంది షెల్ట‌ర్ల‌ను ఆశ్ర‌యించారు.

ఇక‌, రోడ్లు కొట్టుకుపోయి ఊళ్ల‌కు ఊళ్ల‌కు మ‌ధ్య సంబంధాలు కూడా తెగిపోయాయి. ఇక‌, తెలంగాణ ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. విశ్వ‌న‌గ‌రంగా సీఎం కేసీఆర్ పేర్కొంటున్న హైద‌రాబాద్ వాన‌నీటిలో మునిగిపోయింది. నాలాలు పొంగి రోడ్లే న‌దుల‌య్యాయి. జ‌న‌జీవ‌నం వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు స్తంభించింది. ఇప్పుడిప్పుడే ఈ రెండు రాష్ట్రాలూ కోలుకుంటున్నాయి. ఈ సమ‌యంలో ఉదారంగా సాయం చేస్తుంద‌ని కేంద్రం పై ఈ రెండు ప్ర‌భుత్వాలూ ఆశ‌లు పెట్టుకున్నాయి. మ‌రోప‌క్క‌ - నిన్న ఏపీకి చెందిన కేంద్ర మంత్రి వెంక‌య్య నేరుగా హెలికాప్ట‌ర్ ఎక్కి గుంటూరులో ఏరియ‌ల్ వ్యూ కూడా నిర్వ‌హించారు. అంతా చుట్టి ప‌రిస్థితిని తెలుసుకున్నారు. దీంతో ఇంకేముంది వెంక‌య్య త‌న ప‌ర‌ప‌తిని ఉప‌యోగించైనా స‌రే వ‌ర‌ద బాధిత ఏపీ - తెలంగాణ‌ల‌పై కాసుల వ‌ర‌ద కురిపించేస్తాడ‌ని ఇద్ద‌రు సీఎంలు ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే - వెంక‌య్య ఏమ‌న్నారంటే.. ఇద్ద‌రు సీఎంల‌కూ సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. వ‌ర‌ద క‌ష్టం అంతా ఇంతాకాద‌ని - నిజంగానే ఏపీ - తెలంగాణ‌లు నిండా మునిగాయ‌ని మాట‌ల్లోనే క‌న్నీరు కార్చారు. కేంద్రం ఏమిస్తుంద‌ని ఆలోచించ‌కుండా.. ముందు మీద‌గ్గ‌రున్న విప‌త్తు సొమ్మును ఉదారంగా ఖ‌ర్చు చేయాల‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. పంట నష్టం అంచనాలపై కేంద్ర మంత్రులకు తాను వివరించి చెప్పానని, కేంద్ర బృందాలను పంపాలని సిఫార్సు చేశానని వివరించారు. రెండు రాష్ట్రాలూ పంట నష్టం అంచనాలను పంపిన తరువాత అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని చెప్పారు. ఇదీ.. వెంక‌య్య రెండు రాష్ట్రాల‌కూ ఇచ్చిన సూప‌ర్ ఆఫ‌ర్‌! ఇది ఆఫ‌ర్‌ నో లేక ఉచిత స‌ల‌హానో ఆయ‌నే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/