Begin typing your search above and press return to search.

అబ్బా..వెంకయ్యకు ఎంత ఇబ్బంది వచ్చిందంటే?

By:  Tupaki Desk   |   20 Jun 2019 3:56 PM GMT
అబ్బా..వెంకయ్యకు ఎంత ఇబ్బంది వచ్చిందంటే?
X
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా జరిగి ఉపరాష్ట్రపతిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యానాయుడికి ఇప్పుడు నిజంగానే పెద్ద ఇబ్బంది వచ్చిందనే చెప్పాలి. తాను ఎంతగానో అబిమానించే నారా చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలోని టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీకిలోకి చేరుతున్న కీలక ఘట్టానికి తానే నేతృత్వం వహించాల్సి రావడం అంటే... వెంకయ్యకు నిజంగానే ఇబ్బందే కదా. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడుల మధ్య అనుబంధం ఈ నాటిది కాదు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరిదీ పక్కపక్క జిల్లాలే.

జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు నుంచి వీరి మధ్య మంచి అనుబంధమే ఉంది. వీరిద్దరు ఎక్కడ వేదిక పంచుకున్నా... ఒకరిని మరొకరు పొగిడేసుకుని - ఒకరి గొప్పతనాన్ని మరొకరు కీర్తించుకోనిది అక్కడి నుంచి కదలరు. చంద్రబాబును వెంకయ్య కీర్తిస్తే... వెంకయ్యను చంద్రబాబు అంతే స్థాయిలో కీర్తించుకోకుండా ఊరుకోరు. అంతేకాదండోయ్... తాను బీజేపీలో ఉంటే... అదే బీజేపీతో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ జట్టు కట్టాలని - ఇద్దరమూ కలిసి సాగాలని కోరుకునే వ్యక్తి వెంకయ్య. అలాంటి వెంకయ్య ఇప్పుడు టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరుతున్న ఘట్టానికి బాద్యత వహించాల్సి రావడం అంటే మాటలు కాదు కదా. టీడీపీకి చావుదెబ్బగానే పరిగణిస్తున్న ఈ పరిణామం మొత్తం వెంకయ్య సమక్షంలోనే జరిగింది.

తాము టీడీపీ నుంచి బయటకు వస్తున్నామని - తమను ఇకపై టీడీపీ సభ్యులుగా కాకుండా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని - అంతేకాకుండా తాము నలుగురమూ బీజేపీలో చేరుతున్నాం కాబట్టి... తమను ఇకపై బీజేపీ సభ్యులుగా గుర్తించాలని కూడా సుజనా చౌదరి - సీఎం రమేశ్ - టీజీ వెంకటేశ్ - గరికపాటి మోహన్ రావులు రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వెంకయ్యనాయుడికే లేఖలు ఇచ్చారు. ఇలా టీడీపీ ఎంపీలు బీజేపీలోకి చేరుతున్న కార్యక్రమంలో కీలక ఘట్టమైన ఈ కార్యక్రమం వెంకయ్య చేతుల మీదుగా జరగడం నిజంగానే ఆయనకు ఇబ్బందికరమే కదా. నిత్యం చంద్రబాబు ఉన్నతిని - టీడీపీ ఉన్నతిని కాంక్షించే వెంకయ్య... ఇలా టీడీపీ పతనానికి కారణమవుతున్న కీలక ఘట్టానికి తానే ప్రత్యక్ష సాక్షిగా నిలవడం నిజంగానే ఇబ్బందే కదా.