Begin typing your search above and press return to search.

వెంకయ్యకు మంత్రి పదవి మరో ఏడాదేనా?

By:  Tupaki Desk   |   1 Dec 2015 7:37 AM GMT
వెంకయ్యకు మంత్రి పదవి మరో ఏడాదేనా?
X
మరో ఆరు నెలల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పదవికి ఎసరొస్తుందా...? ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియనుండడంతో మంత్రి పదవి నుంచీ దిగిపోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. భాజపాలో ఎవరూ మూడు సార్లుకు మించి రాజ్యసభ సభ్యత్వం పొందరాదని తీసుకున్ననిర్ణయమే దీనికి కారణమని తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో మోదీ మంత్రిమండలిలో ఉన్న మూడో విడత రాజ్యసభ సభ్యులు అరుణ్‌ జైట్లీ - రవిశంకర్ ప్రసాద్ - వెంకయ్యనాయుడుల భవిష్యత్తుపై నీడలు కమ్ముకుంటున్నాయి. వీరిలో రవిశంకర్ ప్రసాద్ - అరుణ్ జైట్లీల రాజ్యసభ పదవీ కాలం 2018 వరకు ఉన్నప్పటికీ వెంకయ్యకు మాత్రం 2016 జూన్ తో ముగియనుంది. జూన్ తరువాత ఆరునెలల్లో ఆయన పార్లమెంటుకు ఎంపికైతేనే పదవి నిలుస్తుంది. ఈ లెక్కన ఆయనకు టెక్నికల్ గా మరో ఏడాది వరకు మాత్రమే మంత్రి పదవిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. నాలుగో సారి ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వకపోయినా, ఎక్కడైనా లోక్ సభ స్థానం ఖాళీ అయితే అక్కడి నుంచి ఆయన గెలవకపోయినా మంత్రి పదవిని కోల్పోక తప్పదు.

అయితే... బీజేపీలో వెంకయ్యకు ఉన్న కీలక స్థానం దృష్ట్యా ఆయన్ను ఎలా ఉపయోగించుకోవాలా అని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూడు సార్లు నిబంధన నుంచి ఆయన్ను మినహాయిస్తారన్న వాదనా వినిపిస్తోంది. వాజపేయి - అద్వానీ.. నుంచి మోడీ వరకు అందరిలో కలిసి పనిచేసిన, సన్నిహితంగా ఉన్న నేతగా... 2002-04 మధ్య కాలంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా వ్యవహరించి వ్యక్తిగా - వాజపాయి కేబినెట్ లో - ప్రస్తుతం మోదీ కేబినేట్ లో గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున వెంకయ్యనాయుడిని వదులుకోరని అంటున్నారు. పైగా బీజేపీ గతంలో నాలుగుసార్లు అవకాశం కల్పించిన సందర్భాలున్నాయని గుర్తుచేస్తున్నారు. కానీ, బీజేపీ వంటి పార్టీల్లో పార్టీ రాజ్యాంగాలను తూ.చ. తప్పకుండా పాటిస్తారు కాబట్టి అది కొత్త నిబంధన అమలు చేయాలని నిర్ణయించుకున్న తరువాత అది అసాధ్యమే.

అయితే.. తాజా నిబంధన ప్రకారం నాలుగోసారి రాజ్యసభ సభ్యత్వం కష్టమే అయినా గతంలో మాత్రం పలువురు బీజేపీ నేతలు నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. జస్వంత్ సింగ్ - ప్రమోద్ మహాజన్ లకు అలాంటి అవకాశం దక్కింది. అద్వానీ కూడా నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్య వహించారు. అయితే తొలి రెండుసార్లు ఆయన జనసంఘ్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే ఎస్ ఎస్ అహ్లువాలియా రెండు సార్లు కాంగ్రెస్ నుంచి, ఆ తరువాత రెండుసార్లు బీజేపీ నుంచి రాజ్యసభకు జార్ఘండ్ - బీహార్ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా అయితే ఏకంగా ప్రస్తుతం ఆరోసారి రాజ్యసభలో ఉన్నారు. అయితే తొలి నాలుగుసార్లు ఆమెకు కాంగ్రెస్ అవకాశమిచ్చింది. కాబట్టి బీజేపీ లెక్కల్లోకి ఆమె రారు.

ఇక మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నవారిలో వెంకయ్యలా మూడేసిసార్లు రాజ్యసభకు వెళ్లినవారు మరికొందరు ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి లక్కిరామ్ అగర్వాల్ - రాజస్థాన్ నుంచి రామ్ దాస్ అగర్వాల్ - యూపీ నుంచి రాజ్ నాథ్ సింగ్ - దిలీప్ సింగ్ జుదేవ్ (చత్తీస్ గఢ్) - కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ (1990 నుంచి 2012 మధ్య కాలంలో) మూడు సార్లు రాజ్యసభ అవకాశం పొందారు.

కాగా మోడీ కేబినెట్ లో ప్రస్తుతం 15 మంది బీజేపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మోడీ కేబినెట్ లోని.. తావర్‌ చంద్ గెహ్లాట్ - పీయూష్ గోయల్ - నజ్మా హేప్తుల్లా - స్మృతీ ఇరానీ - అరుణ్ జైట్లీ - ప్రకాష్ జవదేకర్ - ముక్తార్ అబ్బాస్ నక్వీ - నిర్మలా సీతారామన్ - మనోహర్ పరికర్ - సురేష్ ప్రభు - ధర్మేంద్ర ప్రధాన్ - రవిశంకర్ ప్రసాద్ - బీరేంద్ర సింగ్‌ లు రాజ్యసభ సభ్యులే. వీరిలో జైట్లీ - రవిశంకర్ ప్రసాద్ - వెంకయ్యనాయుడులు మూడో విడత పదవిలో ఉన్నారు. ఆయనకు జూన్ తో పదవీకాలం ముగుస్తుండగా, మిగతా ఇద్దిరీ 2018వరకు ఛాన్సుంది. కాబట్టి ఈ కేబినెట్ లో దాదాపుగా పూర్తికాలం కొనసాగే ఛాన్సుంది.

మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ఉన్న నజ్మాహేప్తుల్లా ఆరోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆమెకు పదవీకాలం 2018 వరకు ఉండడంతో ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేదు. ఆరుసార్లలో ఆమె నాలుగుసార్లు కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లగా... మిగతా రెండు సార్లు బీజేపీ అవకాశమిచ్చింది. 2004లో ఆమె బీజేపీ చేరిన తరువాత ఇప్పటికీ ఇంకా రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మరి వెంకయ్య విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.