Begin typing your search above and press return to search.

బీజేపీలో వెంకయ్య సో.. స్పెషల్ బాస్

By:  Tupaki Desk   |   25 May 2016 4:55 AM GMT
బీజేపీలో వెంకయ్య సో.. స్పెషల్ బాస్
X
కొన్ని సందర్భాల్లో ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యత ఇవ్వటం.. మరికొన్ని సందర్భాల్లో కరివేపాకులా చూస్తున్నారన్న మాట ఏపీకి చెందిన బీజేసీ సీనియర్ నేత వెంకయ్యనాయుడి విషయంలో వినిపిస్తూ ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారిగా కూడా విజయం సాధించని వెంకయ్య.. రాజ్యసభ సభ్యుడిగా మూడుసార్లు ఎంపిక కావటం.. కేంద్రమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించటం తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. దీనికి సమంజసమైన కారణం లేకపోలేదు.

ఇప్పటివరకూ బీజేపీలో రాజ్యసభకు మూడుసార్లకు మించి మరే నేతను నామినేట్ చేయలేదు. మిగిలిన వారితో పోలిస్తే.. వెంకయ్య స్థానం పార్టీలో భిన్నమన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో వెంకయ్యకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా? లేదా? అన్న అంశంపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. పార్టీ తరఫున ఏ నేతను అయినా గరిష్ఠంగా మూడుసార్లకు మించి రాజ్యసభకు పంపకూడదన్న నియమాన్ని బీజేపీ పాటిస్తోంది. దీన్ని వెంకయ్య కోసం సడలిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇలాంటి ప్రచారానికి తెర దించుతూ వెంకయ్యను కర్ణాటక నుంచి నామినేట్ చేసేందుకు వీలుగా బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవటంతో బీజేపీలో ఎవరికి దక్కని ఒక గౌరవం వెంకయ్యకు దక్కినట్లైంది.

రాజ్యసభకు నాలుగోసారి వెంకయ్యను నామినేట్ చేస్తున్న నేపథ్యంలో అలాంటి ఘనతను సాధించిన ఏకైక నేత వెంకయ్య అనే చెప్పాలి. కర్ణాటక నుంచి ఆయన్ను మరోసారి ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఆయనకు పార్టీలో ఉన్న స్థానం ఎంతన్న విషయం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాదిలో బలంగా ఉండే బీజేపీ లాంటి పార్టీలో దక్షిణాదికి చెందిన ఒక నేత కోసం పార్టీ విధానంలోనే మార్పు చేస్తూ నిర్ణయం తీసుకోవటం చూస్తే.. బీజేపీలో వెంకయ్య స్థానం ఎంత స్పెషల్ అన్న విషయం చెప్పకనే చెప్పేయొచ్చు. పార్టీ కోసం అహరహం శ్రమించే వెంకయ్యకు ఇది దక్కాల్సిన మర్యాదేననటంలో ఎలాంటి సందేహం లేదు.