Begin typing your search above and press return to search.

వెంకయ్యకు ఇప్పుడో కొత్త దిగులు వచ్చేసిందట

By:  Tupaki Desk   |   26 Feb 2017 5:48 AM GMT
వెంకయ్యకు ఇప్పుడో కొత్త దిగులు వచ్చేసిందట
X
వెంకయ్యకు ఇప్పుడు కొత్త బాధ వచ్చేసింది. అక్కడెక్కడో మహారాష్ట్రలోనో..రాజస్థాన్ లోనో..హర్యానాలో పార్టీ గెలవటం ఏంటి? హైదరాబాద్ లో డప్పులు మోగించుకుంటూ సంబరాలు చేసుకోవటం ఆయనకు నచ్చట్లేదు. అక్కడెక్కడో పార్టీ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకోవటమే కానీ.. ఇక్కడ ఎప్పుడు గెలిచేది? అన్నది ఆయనకు ఆవేదనగా మారింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో.. వెంకయ్య మాటల్లో చెప్పాలంటే అండమాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ బీజేపీకి ఓటు వేస్తున్నారని.. బీజేపీకి పట్టం కడుతున్నారని.. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విజయం తమ వశం కావట్లేదన్న బాధ ఆయన్ను వెంటాడుతోంది.

అదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు. అక్కడెక్కడో విజయం సాధిస్తే.. ఇక్కడ సంబరాలు చేసుకోవటం కాదు.. ఇక్కడ సంబరాలు చేసుకునేలా తయారు కావాలని.. వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అన్నిచోట్లా ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు కట్టటం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ మాటకు వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దక్షిణాదిన కర్ణాటక తప్పించి మిగిలిన ఎక్కడా కూడా బీజేపీకి బలం లేదన్నది మర్చిపోకూడదు. బలం లేని చోట కొత్త బలాన్ని పెంచుకోవటానికి అనుసరిస్తున్న విధానం.. వ్యూహం సరిగా లేకపోవటం.. బలపడేందుకు వచ్చిన అవకాశాల్నిసద్వినియోగం చేసుకోకపోవటం ఒక కారణమైతే.. వెంకయ్య లాంటి నేతలు.. కొత్త వాళ్లను ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నారన్న అపవాదును కాదనలేం.

ఎక్కడో సాధించిన విజయాల్ని తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోవటం ఏమిటన్న వేదన వెంకయ్యకు నిజంగా ఉండి ఉంటే.. ఈ ప్రాంతాల్లో పార్టీ బలపడేందుకు మాటలు కాకుండా చేతల్లో చేసి చూపిస్తే బాగుంటుంది. ఎక్కడి వరకో ఎందుకు.. ఏపీ విషయాన్నే తీసుకుంటే.. ప్రత్యేక హోదా మీద ఇచ్చిన మాటను తప్పటం ద్వారా.. పార్టీకి ఫ్యూచర్ అన్నది లేకుండా చేశారన్నది మర్చిపోకూడదు. ఇలాంటి తప్పులు చేస్తున్నంత కాలం ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని ఎందుకు అనుకుంటారు?

తెలుగురాష్ట్రాల్లో గెలుస్తుందన్న నమ్మకం లేకపోవటం వల్లే బీజేపీకి ఓటు వేయటం లేదని చెబుతున్న వెంకయ్య.. అసలు విషయాన్ని మర్చిపోతున్నారని చెప్పాలి. ప్రజలు ఓటు వేయకపోవటానికి కారణం.. గెలుస్తారన్న నమ్మకం లేకపోవటం కంటే కూడా.. గెలిపిస్తే వచ్చే లాభం ఏమీ ఉండదన్న సందేహమేనన్నది గుర్తిస్తే.. ఫలితం వేరుగా ఉంటుంది. లేకుంటే.. భ్రమల్లోనే కాలం గడపాల్సి ఉంటుందన్నది మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/