Begin typing your search above and press return to search.

వెంక‌య్య‌....మాట‌లు ఎంత బాగా చెప్తావో

By:  Tupaki Desk   |   30 Aug 2015 4:26 AM GMT
వెంక‌య్య‌....మాట‌లు ఎంత బాగా చెప్తావో
X
కేంద్ర మంత్రి, తెలుగు గ‌డ్డ‌కు చెందిన బీజేపీ నాయ‌కుడు వెంక‌య్య‌నాయుడు భ‌లే మాట‌కారి. త‌న మాట‌కారిత‌నంతో అంద‌లం ఎక్కిన వెంక‌య్యనాయుడు చాలా సార్లు మాట‌తీరుతో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిల‌స్తుంటారు. న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వెంక‌య్య‌నాయుడు.. బీజేపీ అగ్ర‌నేత‌ల్లో టాప్ 5లో నిలిచారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వానికి ఎంతో అండ‌గా ఆయ‌న స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న మ‌రోమారు ఆస‌క్తిక‌రంగా మారింది.

మోడీ సొంత రాష్ర్ట‌మైన గుజ‌రాత్‌ లో ప‌టేళ్లు ఓబీసీ హోదా కోసం చేస్తున్న ఉద్యమం ఆందోళ‌న రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. వెంక‌య్య‌నాయుడు దీన్ని ఉటంకిస్తూ...వివ‌క్ష‌, అణిచివేత‌కు గురైన వ‌ర్గాల‌ను మిగ‌తా స‌మాజంతో క‌లిపేందుకు ఉద్దేశించిన రిజ‌ర్వేష‌న్లు దారిత‌ప్పుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. రిజ‌ర్వేష‌న్లు రాజ‌కీయ ఆయుధంగా మారిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాల్లోకి కుల‌, మ‌త , ప్రాంతీయ రాజ‌కీయాలు ప్ర‌వేశించాయ‌ని ఆరోపించారు.

అయితే వెంక‌య్య‌నాయుడు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ కోణంలోనే చూడ‌క్క‌ర్లేద‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఉంది. అందులో పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రిగా కీల‌క‌స్థానంలో వెంక‌య్యనాయుడు ఉన్నారు. రిజ‌ర్వేష‌న్ల‌పై ఇలాంటి అభిప్రాయం ఉన్న వెంక‌య్య‌నాయుడు త‌మ ప్ర‌భుత్వం ద్వారా రిజ‌ర్వేష‌న్ల‌పై బిల్లు పెట్టించ‌వచ్చు. మ‌రో ప‌దేళ్లు లేదా వాళ్లు అనుకున్న స‌మ‌యం వ‌ర‌కే రిజ‌ర్వేష‌న్లు అమ‌లులో ఉంటాయ‌ని ప్ర‌క‌టింప‌చేయ‌వ‌చ్చు. లేదా ఎలాగు బీసీ రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకోసం ప్ర‌తి ప‌దేళ్ల‌కోమారు కొన‌సాగింపు ఉత్త‌ర్వులు విడుద‌ల చేయాల్సిందే. క‌నీసం ఆ నిర్ణ‌యం అయినా వెలువ‌డ‌కుండా ప్ర‌భుత్వం త‌ర‌ఫున చూసుకోవ‌చ్చు. కానీ ఇవేమీ చేయ‌కుండా..... స‌భ‌కు హాజ‌రైన వారిని చూసి చ‌ప్ప‌ట్లు కొట్టేందుకు నాలుగు మాట‌లు మాట్లాడితే...నాయ‌కుడిగా విలువ ప‌లుచ‌న కాకుండా మ‌రేమి అవుతుంది?