Begin typing your search above and press return to search.

సినిమాల మీద వెంక‌య్య పంచ్ అదిరిందిగా

By:  Tupaki Desk   |   24 Feb 2018 6:07 AM GMT
సినిమాల మీద వెంక‌య్య పంచ్ అదిరిందిగా
X
అంత్య‌ప్రాస‌ల‌తో అల‌వోక‌గా మాట్లాడ‌ట అంత తేలికైంది కాదు. వెనుకా ముందు చూసుకోకుండా.. కించిత్ త‌డ‌బాటు లేకుండా ఈ త‌ర‌హాలో మాట్లాడ‌టం.. అది కూడా మాతృభాష అయిన తెలుగులో మాత్ర‌మే కాదు.. హిందీ.. ఇంగ్లిషులోనూ మాట్లాడే సామ‌ర్థ్యం ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడికి ఉంద‌ని చెప్పాలి.

సంద‌ర్భం ఏదైనా.. ఆయ‌న మాట‌ల ప్ర‌వాహం ఒకేలా ఉంటుంది. ఏ మాత్రం త‌డ‌బాటు ప‌డ‌కుండా గ‌ల‌గ‌ల పారే జ‌ల‌పాతంలా ఆయ‌న మాట‌లు ఉంటాయి. ఉప రాష్ట్రప‌తి కుర్చీలో కూర్చున్న త‌ర‌చూ తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌టం.. ఏ మాత్రం వీలు చిక్కినా ద‌క్షిణాదిని ప‌లుక‌రించ‌టం ఆయ‌న‌కు అల‌వాటు. తాజాగా చెన్నైలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

తెలుగు సినిమా మీద చెర‌గ‌ని ముద్ర వేసిన దివంగ‌త తెలుగు సినీ దిగ్గ‌జం.. విజ‌యా వాహినీ స్టూడియోస్ అధినేత‌.. విజ‌య హెల్త్ సెంట‌ర్ స్థాప‌కులు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి సేవ‌ల‌కు గుర్తుగా కేంద్రం రూపొందించిన త‌పాలా బిళ్ల‌ను వెంక‌య్య విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమాల గురించి మాట్లాడారు.

త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పారు. ఇటీవ‌ల కాలంలో సినిమాల్లో చోటు చేసుకున్న మార్పుల్ని.. అంత‌కంత‌కూ పెరుగుతున్న అశ్లీల‌త‌.. బూతుపై విమ‌ర్శ‌ల్ని ఎక్కుపెట్టారు. సంప్ర‌దాయాల్ని భావిత‌రాల‌కు అందించేలా సందేశాత్మ‌క చిత్రాల్ని తీయాల‌ని పిలుపునిచ్చిన వెంక‌య్య.. ఈ సంద‌ర్భంగా ఇప్పుడొస్తున్న సినిమాల‌పై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.

గ‌తంలో అమోద‌యోగ్య‌మైన స‌న్నివేశాల‌తో శృంగారాన్ని ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో క‌ల్పించేవార‌ని.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఉంద‌న్నారు. ఇప్ప‌టి సినిమాల్లో శృంగారం త‌క్కువ‌.. అంగారం ఎక్కువ‌ని.. ఇది దుర‌దృష్ట‌క‌రంగా అభివ‌ర్ణించారు. హింస‌.. అశ్లీల‌త‌.. బూతు ఇదేనా మ‌న భావిత‌రాల‌కు అందించేదంటూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు వెంక‌య్య‌. అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌కు పెద్ద‌పీట వేస్తున్న ద‌ర్శ‌క‌..నిర్మాత‌ల‌కు వెంక‌య్య మాట వినిపించే అవ‌కాశం ఉందా?