Begin typing your search above and press return to search.

క‌వ‌ర్ చేయ‌టానికి కిందామీడా ప‌డుతున్న వెంక‌య్య‌

By:  Tupaki Desk   |   24 July 2017 4:00 AM GMT
క‌వ‌ర్ చేయ‌టానికి కిందామీడా ప‌డుతున్న వెంక‌య్య‌
X
చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్నారు వెంక‌య్య‌. ప్రోటోకాల్ ప్రకారం చూస్తే.. దేశంలోనే అత్యున్న‌త ప‌ద‌వుల్లో రెండోదైన ప‌ద‌విని చేప‌ట్టేందుకు కొద్ది రోజుల దూరంలో ఉన్న వేళ‌.. కేంద్ర‌మంత్రిగా ఉన్న వెంక‌య్య ప‌డుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఉప రాష్ట్రప‌తిగా ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని బీజేపీ క‌న్ఫ‌ర్మ్ చేసిన వేళ‌.. అంద‌రి కంటే ఎక్కువగా ఫీల్ అయ్యింది వెంక‌య్య‌నే. త‌న ఇన్న‌ర్ ఫీలింగ్స్ ను త‌న‌కు స‌న్నిహిత‌మైన మీడియా ద్వారా చెప్ప‌క‌నే చెప్పేసిన ఆయ‌న‌.. ఇప్పుడు త‌న ఫీలింగ్స్‌ ను ఖండిస్తూ.. మీడియా ఏదేదో రాస్తుంద‌ని చెప్పుకోవాల్సి రావ‌టం కాస్త క‌ష్ట‌మైన ప‌నే.

కానీ.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అలాంటి క‌వ‌రింగ్ కు తెర తీశారు వెంక‌య్య‌. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి చేప‌ట్ట‌టం త‌న‌కు ఇష్టం లేద‌న్న విష‌యాన్ని చాలా ప‌ద్ధ‌తిగానే చెప్పారు వెంక‌య్య‌. పేరుకు పెద్ద ప‌ద‌వే అయినా.. ఆ ప‌ద‌విని చేప‌డితే క్రియాశీల రాజ‌కీయాల నుంచి ఎలా ప‌క్క‌కు వెళ్లాల్సి వ‌స్తుంద‌న్న విష‌యాన్ని వెంక‌య్య‌కు ఎవ‌రూ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే ఆయ‌న త‌న‌లోని అసంతృప్తిని మీడియా ముందు క‌క్కేశారు.

మ‌న‌సులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా.. మోడీకి ఇబ్బంది క‌లిగించే మాట ఏ నేత నోటి నుంచైనా రాకూడ‌ద‌న్న పాల‌సీని వెంక‌య్య కాస్త క్రాస్ చేశార‌నే చెప్పాలి. అయితే.. దాన్ని స‌రిదిద్దేందుకు వెంక‌య్యే స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి త‌న‌ను ఎంపిక చేసిన విష‌యంపై త‌న‌లోని అసంతృప్తిని మీడియా మ‌రో కోణంలో చూపించిందన్న మాట‌ను చెబుతూ.. గ‌తంలో తాను చెప్పిన మాట‌ల‌కు అంద‌మైన క‌వ‌రింగ్ ఇచ్చేందుకు పొలిటిక‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేక ఇష్టాగోష్టిని ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా వెంక‌య్య చాలా వివ‌రంగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌కీ ఆయ‌న మాట‌ల్ని సింఫుల్ గా చెప్పాలంటే.. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి అభ్య‌ర్థిగా త‌న‌ను ఎంపిక చేసిన నాటి నుంచి ర‌క‌ర‌కాల అనుమానాలు.. వ్యాఖ్యానాలు.. ఊహాగానాల‌తో క‌థ‌నాలు వండి వారుస్తున్న వైనం మీడియాలో క‌నిపిస్తోంద‌ని.. అవ‌న్నీ నిజాలు కావ‌ని.. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విని త‌న‌కు కేటాయించేందుకు మోడీ ఎంతగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకున్నారో తెలుసా?.. ఉప రాష్ట్రప‌తి లాంటి కీల‌క బాధ్య‌త‌ల్ని త‌న‌నే ఎందుకు ఎంపిక చేసిన విష‌యాన్ని.. ఈ సంద‌ర్భంగా మోడీ త‌న‌తో చెప్పిన విష‌యాల సారాంశాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు వెంక‌య్య‌. మొత్తంగా చూస్తే.. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విని చేప‌ట్ట‌టం త‌న‌కు ఆస‌క్తి లేదంటూ త‌న నోటితో తాను చెప్పిన మాట‌ను స‌రిదిద్దుకొని.. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి చేప‌ట్ట‌టం ఎంత ముఖ్య‌మ‌న్న విష‌యాన్ని చెప్పేందుకు వెంక‌య్య ప్ర‌య‌త్నించారు.

మీడియా ప్ర‌తినిధుల‌తో ఇష్టాగోష్టి సంద‌ర్భంగా వెంక‌య్య నోటి నుంచి వ‌చ్చిన మాట‌ల్ని ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా ఆయ‌న మాట‌ల్లో చెబుతూ ఒక మీడియాలో ఆయ‌న మాట‌లు అచ్చు అయ్యాయి. దాన్ని చూస్తే..

= ‘'ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను నిర్ణయించినప్పటినుంచి కొంతమంది రకరకాల అనుమానాలు - వ్యాఖ్యానాలు - అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవికి రాజీనామా ఇవ్వడం నాకు ఇష్టం లేదని, మంత్రివర్గం నుంచి తప్పించారని ప్రచారం చేస్తున్నారు. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ సహజం. కానీ ఆ ప్రచారంలో నిజం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. నేను పదవుల్ని ప్రేమించలేదు’'

= ‘'నాకు చిన్నప్పటినుంచి ఇప్పటివరకూ అనేక పదవులు - బాధ్యతలు అడగకుండానే వచ్చాయి. నాకు వచ్చిన బాధ్యతలు శక్తి మేరకు నిర్వర్తించాను. ఎలాంటి పెద్ద కుటుంబ నేపథ్యం లేకున్నా స్వయం కృషితో, పార్టీ సహకారంతో ఈ స్థాయికి వచ్చాను. అందుకు ప్రధాన కారణం చిన్న వయస్సులోనే ఆర్‌ ఎస్‌ ఎస్‌ పరిచయం కావడమే. వాజ్‌ పేయి - అద్వానీల గురించి రిక్షాలో మైక్‌ ల్లో ప్రచారం చేసి, పార్టీ కోసం గోడలపై పోస్టర్లు అంటించి, స్తంభాలెక్కి జెండాలు కట్టిన స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన నేను రాజ్యాంగ బద్ధమైన పదవిని చేపడితే పార్టీతో అనుబంధం వదులుకోవాల్సి వస్తుందన్న బాధతో భావోద్వేగానికి గురయ్యాను"

= "భాజపా నాయకులు ఎక్కువగా హోటళ్లలో బస చేయరు. స్థానిక కార్యకర్తల కుటుంబాలతో కలిసి ఉండటం సహజం. కొత్తగా వచ్చే ప్రొటోకాల్‌ వల్ల ఇలాంటి అనుబంధాలన్నీ దూరం అవుతాయేమోనన్న బాధ కలిగింది. మనసుకు ఇష్టమొచ్చినట్లుగా చాలా స్వేచ్ఛగా, సాధారణంగా ఉండటం నాకు అలవాటు. దారిలో వెళ్తూవెళ్తూ పార్టీ కార్యకర్తలు - నాయకుల ఇళ్లకు వెళ్లిన సందర్భాలెన్నో. నాకు ఇష్టమైన భోజనాలు ఏ రెస్టారెంట్‌ లో దొరికితే ఆ రెస్టారెంట్‌ ముందు నిలబడి తినడం... జాతీయ రహదారిలో వెళ్తున్నప్పుడు శెట్టమ్మగారి దోసెలు, మదనపల్లెలో రంగన్నదోసె, చిత్తూరులో రామూ పాయ, నెల్లూరులో పులి బొంగరాలు, విజయవాడలో పునుగులు తినడం అలవాటు. నిరంతర రాజకీయ సంబంధాలనుంచి ఒక్కసారి రాజ్యాగబద్ధమైన పదవిలోకి వెళ్లడం నాకు మొదటినుంచీ ఇష్టంలేదు. ఇందులో రహస్యమేమీ లేదు. నేను ఎప్పుడూ దాన్ని ఆశించలేదు’'

= '‘ప్రధాని మోదీ చేపట్టిన భారీ అజెండాను అయిదేళ్లలో పూర్తి చేయలేం. ఆయన మరోసారి వస్తేనే ఇవి పూర్తవుతాయి అని నేను నమ్మి పార్టీలో ప్రముఖ వ్యక్తిగా, మోదీకి అండగా నిలవాలనుకున్నాను. నేను ప్రధానమంత్రిని ప్రశంసించడంపై కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. 2019లో ఈయనేదో ఆశిస్తున్నారు, మోదీకి పోటీగా తయారవుతున్నారని పిచ్చిగా ప్రచారం చేశారు. అయినా నేనెక్కడ... మోదీ ఎక్కడ?"

= "అమిత్‌షా వ్యూహం పన్ని వెంకయ్యనాయుడిని తప్పించారని కూడా ప్రచారం చేస్తున్నారు. మోదీ, అమిత్‌షా ద్వయం పనితీరు బాగుందని నేను అందరికీ చెబుతున్నాను కాబట్టి ఆయన నన్ను తప్పించే ప్రసక్తేలేదు. నేను నా భవిష్యత్తును ముందే దిశా నిర్దేశం చేసుకొని పెట్టుకున్నాను. 2019 ఎన్నికల్లో మోదీని మళ్లీ ప్రధానిని చేసిన తర్వాత పదవులను వదిలి పెట్టుకొని రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించి సమాజ సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఈ మాట సాక్షాత్తూ ప్రధానమంత్రికే చెప్పినప్పుడు దీని గురించి తర్వాత మాట్లాడుదాం, బయట ఎప్పుడూ ప్రస్తావించవద్దు అని వారించారు"

= "2019 జూన్‌కల్లా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ఆ ప్రభుత్వం కొంత సర్దుకున్న తర్వాత 2020 జనవరి వరకు ఉండి కేంద్ర మంత్రి పదవిని కూడా వదిలేసుకొని సమాజసేవకు అంకితమయ్యాడన్న ఉదాహరణను.. ఉదాత్తతను కార్యకర్తల ముందు.. దేశం ముందు ఉంచాలనుకున్నాను’'

= '‘ఉప రాష్ట్రపతి అభ్యర్థులపై పార్టీలో చర్చ జరిగిన తర్వాత నన్ను కొన్ని పేర్లు అడిగితే ఇచ్చాను. అన్నింటినీ పరిశీలించిన తర్వాత అందరూ నీపేరే చెబుతున్నారని అధ్యక్షుడు నాతో చెప్పారు. రాష్ట్రపతిగా కొత్త వ్యక్తి వస్తున్నారు, అందువల్ల ఉప రాష్ట్రపతిగా అనుభవం ఉన్న వ్యక్తి ఉంటే ఇద్దరూ మాట్లాడుకొని ముందుకెళ్లవచ్చని చెప్పారు. రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున సభను నడపడానికి అనుభవం ఉన్నవాళ్లు ఉండాలన్నారు. అందుకని పార్టీలో ఎవరితో మాట్లాడినా ఏకగీవ్రంగా మీపేరే చెబుతున్నారని అమిత్‌షా చెప్పారు. ముందే ప్రధానమంత్రిని కలిసి బయట ప్రచారం జరుగుతున్నట్లు వాటిపై నాకు ఆసక్తి, ఆలోచన, వ్యామోహం లేవని చెప్పాను. 2019 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశాను. అప్పుడు ప్రధాని రెండోసారి కూడా రాజకీయాలు వదిలిపెడతాను అన్న పదం వాడొద్దు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. అందువల్ల నా ఉద్దేశం ఇంకోలా ఉందని అనుకోవడానికి వీల్లేదు’'

= '‘ఎమర్జెన్సీ జైలు జీవితం నుంచి రాజకీయ జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించిన వ్యక్తిని ఇక మీదట రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండాలన్న ఆలోచన కొత్తగా అనిపించింది. పార్టీలో ప్రతి ఒక్కరూ నాకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు చెన్నారెడ్డి, జనార్దన్‌రెడ్డి ఎన్నో కష్టాలుపెట్టారు. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి జరగకుండా చూశారు. అయినా అద్భుతంగా అభివృద్ధి చేసి చూపించాను. అందుకే రెండోసారి నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఇందిరా గాంధీని పిలిపించి ప్రచారం చేశారు. అయినా రెట్టింపు మెజార్టీతో గెలిచాను. ఇన్ని ఎన్నికల్లో పోటీ చేసినా రాజకీయాల్లోకి ఇంట్లోంచి రూపాయి తీసుకురాలేదు. ఇంటికి ఒక రూపాయి తీసుకెళ్లలేదు. ప్రతిసారీ ప్రజలే డబ్బు ఇచ్చారు''

= "ఇప్పుడు భాజపా దేశవ్యాప్తంగా బలంగా తయారైంది. కానీ మొదట్లో దానికేమీలేదు. అయినా నేను ఏ వూరికెళ్లినా స్నేహితులు కార్లు తెచ్చేవారు. వూర్లలో ఉచితంగా బస చూపేవారు. ఇవన్నీ గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యాను. మోదీని రెండోసారి ప్రధానిగా చూడకుండానే పార్టీని వదిలిపెట్టాల్సి వస్తోందని బాధేసింది. అంతే తప్ప.. ఉప రాష్ట్రపతి పదవేమీ చిన్న విషయం కాదు. దానికున్న హోదా, గౌరవం వేరు"

= "పార్టీ నిర్ణయించిన తర్వాత వెనక్కు వెళ్లే ప్రసక్తేలేదు. ఉప రాష్ట్రపతి పదవి కొత్త ప్రపంచం. కొత్త జీవితం. రాజకీయ జీవితంలోని ప్రతి మజిలీని ఆస్వాదించిన నాకు ఇది ఎలా ఉండబోతోందో అన్నది అనుభవిస్తేనే కానీ తెలియదు. ఈ మూడేళ్లలో ప్రధానమంత్రి నన్ను ఎంతో అభిమానించారు. విశ్వసించారు. అది మూడేళ్లలో ప్రజలంతా చూశారు’'