Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డిని గెలిపించిన న‌యీం!

By:  Tupaki Desk   |   30 Aug 2016 5:04 AM GMT
కోమ‌టిరెడ్డిని గెలిపించిన న‌యీం!
X
గ్యాంగ్‌ స్టర్ నయీం ఎన్‌ కౌంట‌ర్ రాజ‌కీయ ఆరోప‌ణ‌లకు వేదిక‌గా మారుతోంది. ఇన్నాళ్లు ఆయ‌న అక్ర‌మ సంపాద‌న - బెదిరింపులే తెర‌మీద‌కు రాగా తాజాగా న‌యీం ఎన్నిక‌ల‌ను సైతం ప్ర‌భావితం చేశాడ‌ని తేలుతోంది. న‌ల్ల‌గొండ జిల్లాలో కీల‌క నేత‌లుగా ఉన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ విజ‌యంలో నయీంది కీల‌క పాత్ర అని నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. నయీం చీకటి సామ్రాజ్యం వెనుక కోమటిరెడ్డి సోదరుల హస్తముంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి ద్వారా రూ.5 కోట్లు నయీంకు ఇచ్చి ఎమ్మెల్సీగా రాజగోపాల్‌ రెడ్డి గెలుపొందారని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నయీం ఎవరెవరికి ఫోన్లు చేశారో - ఏమని బెదిరించారో బట్టబయలు చేయాలని వీరేశం డిమాండ్ చేశారు. నయీంతో కలిసి కోమటిరెడ్డి బద్రర్స్ చేసిన దందాలపై సిట్‌తో దర్యాప్తు చేయించాల‌ని డిమాండ్ చేశారు. నయీంపై సిట్ దర్యాప్తులో తమ చీకటి ఒప్పందం బయటపడుతుందేమోననే భయంతోనే, టీఆర్‌ ఎస్ నేతలకు నయీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి - ఎంపీగా ఉన్న‌ రాజగోపాల్‌ రెడ్డి నయీం గురించి నోరు విప్పకుండా, ఇప్పుడు ఆ గ్యాంగ్‌ స్టర్‌ తో టీఆర్‌ ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయని మాట్లాడటం సిగ్గుచేటని మండిప‌డ్డారు. నయీం ఎన్‌ కౌంటర్ తర్వాత క్రాంతిసేన పేరుతో ముగ్గురు ఎమ్మెల్యేలకు వచ్చిన బెదిరింపుల్లో కోమటిరెడ్డి సోదరుల హస్తం ఉందని ఆరోపించారు. నరకాసురుడి వధ జరిగిందని ప్రజలు సంతోషపడుతూ సీఎం కేసీఆర్ - ప్రభుత్వానికి జేజేలు పలుకుతుంటే.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కు ఎన్‌ కౌంటర్‌ పై అనుమానాలు ఎందుకని ప్రశ్నించారు. ఆయనతో ఉన్న సంబంధాలు ఏమిటో చెప్పాలన్నారు.

నయీం ఆస్తులను లాక్కోవడానికి ప్రభుత్వం యత్నిస్తున్నదని బాధపడుతుండ‌టం చూస్తుంటే...ఆస్తులు ఎన్ని ఉన్నాయో రాజగోపాల్‌ రెడ్డికి తెలుసనే అనుమానాలు కలుగుతున్నాయని వీరేశం ఆరోపించారు. నయీం అండతోనే రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరులు కోట్లు సంపాదించి ఈ స్థాయికి ఎదిగినట్లు అనుమానాలున్నాయని విమ‌ర్శించారు. తనను హతమార్చేందుకు రూ.5 కోట్లు డీల్ చేసుకున్నట్లు సమాచారం ఉందని, కోమటిరెడ్డి బ్రదర్స్ గ్రామం నుంచే బెదిరింపులు వచ్చాయన్నారు. మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో నల్లమల అడవుల్లో నక్సల్స్‌ ను గుర్తించి ఏరిపారేసి, నయీంను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. నయీం చేతిలో టీఆర్‌ ఎస్ నేతలు సాంబశివుడు - రాములు హత్యకు గురైనప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.