Begin typing your search above and press return to search.

నెల్లూరు టీడీపీకి మరో బిగ్ షాట్

By:  Tupaki Desk   |   8 Feb 2016 9:22 AM GMT
నెల్లూరు టీడీపీకి మరో బిగ్ షాట్
X
నెల్లూరు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి దూకేవారితో స్పీడందుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కానప్పటికి నేతల హడావుడితో రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. ఇటు టిడిపి అటు వైకాపా ఆకర్ష్ స్కీమ్ ప్రారంభించడంతో నేతల వలసలతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

సింహపురి పాలిటిక్స్‌ లో ఇరుపార్టీల నేతలకు గాలం వేస్తూ రాజకీయాలను నెరుపుతున్నారు. ఇప్పటికే ఆనం బ్రదర్స్ పచ్చకండువా కప్పడం ఒక ఎత్తు అయితే వీరి సోదరుడికి వైకాపా గాలం వేసింది. ఆనం విజయకుమార్‌ రెడ్డి వైపాకాలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు.

ఈ రాజకీయాలు ఇలా ఉండగా.. వైకాపా నేత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆయన్ను వైసీపీలోనే ఉంచాలని ఆ పార్టీ ట్రై చేస్తోంది. వ్యాపారాలు.... విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా, సామాజిక కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. వైకాపా అధినేత జగన్ విపిఆర్‌ కు జిల్లా బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కో ఆర్డినేటర్‌ గా నియమించారు. వైకాపా అభ్యర్థుల గెలుపునకు తనవంతు ఆర్థిక సహకారం అందించిన ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. వైకాపా ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పరిష్కరిస్తూ జిల్లాలో పార్టీ అభివృద్ధికి తనవంతు సహకారం అందించారు. పారిశ్రామికవేత్తగా ఉన్న వేమిరెడ్డి వైకాపా ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో తగిన గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇటీవల సహచరులతో సమావేశం జరిపిన ఆయనకు భవిష్యత్తు రాజకీయాల్లో ఎదగాలంటే చంద్రబాబునాయుడు నాయకత్వంలో పనిచేయాలని అనుచరులు సూచనలు చేశారు. దీంతో వైకాపాను వీడి టిడిపిలో చేరాలని విపిఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డిని టిడిపిలోకి ఆహ్వానిస్తూ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర, సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి తదితరులు మంతనాలు సాగించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే టిడిపి వేదిక సరైనదని విపిఆర్ ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని యువనేత నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన విపిఆర్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే సిఎం సమక్షంలో విపిఆర్ సైకిల్ ఎక్కనున్నారు.

ఈ విషయం తెలియడంతో వైకాపా నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. నెల్లూరులోని వేమిరెడ్డి ఇంటికి వచ్చి ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే.. ఆయనేమీ మెత్తబడలేదని... టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ ఆకర్షణకు ఆనం బ్రదర్స్, పారిశ్రామికవేత్త వేమిరెడ్డి చేరికతో అదనపు బలం చేకూరుతుందని భావిస్తున్నారు.