Begin typing your search above and press return to search.

మ‌హానాడు కాదు మాయ‌నాడు

By:  Tupaki Desk   |   28 May 2017 5:39 PM GMT
మ‌హానాడు కాదు మాయ‌నాడు
X

విశాఖ‌లో తెలుగుదేశం పార్టీ మ‌హానాడు సాగుతున్న తీరుపై వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మ్యానిపెస్టోలో పెట్టిన అంశాలలో 10 శాతం కూడా అమలుపరచని టీడీపీ నేత‌లు...ఎంతో చేశామ‌ని బాకా ఊదుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను తుంగలోకి తొక్కి...రైతులను,డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారని మండిప‌డ్డారు. బాబు సొంత ఇలాకా అయిన‌ నారావారిపల్లెలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని అయిన‌ప్ప‌టికీ ఆహా ఓహో అని ప్ర‌శంసించుకోవ‌డం టీడీపీ నాయ‌కుల‌కే చెల్లింద‌ని అన్నారు. మహానాడు ఒక మాయనాడుగా జరుగుతోంద‌ని వెల్లంప‌ల్లి ఎద్దేవా చేశారు.

వెన్నుపోటుతో ఎన్టీరామారావు పదవిని లాక్కున్న చంద్రబాబుకు ఆయన పేరు చెప్పే నైతిక అర్హత లేదని వెల్లంపల్లి శ్రీ‌నివాస్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రతి మహనాడులో తీర్మానిస్తారు కానీ ప్రయత్నించరని చెప్పిన వెల్లంప‌ల్లి....కేవలం ప్రజలను మభ్య‌పెట్టడానికే తీర్మానం పెడతారని విమ‌ర్శించారు. ఆఖ‌రికి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నందమూరి కుటుంబాన్ని కూడా చంద్రబాబు అవమానిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల్లో ఒక్కరిని కూడా వేదికపై కూర్చోబెట్టలేదని చంద్రబాబు అహంకార వైఖ‌రే ఇందుకు కారణమ‌ని మండిప‌డ్డారు.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఏపీ ప‌ర్య‌ట‌న‌లో లక్షా డెబ్బై ఐదు వేలకోట్ల రూపాయ‌లు రాష్ట్రానికి ఇచ్చామని స్వయంగా ప్రకటించిన విష‌యాన్ని గుర్తుచేసిన వెల్లంప‌ల్లి...ఆ డబ్బులు ఏం చేశారో చంద్రబాబు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో తేడా ఉందా లేక నిధులు ఇచ్చిన‌ప్ప‌టికీ సక్ర‌మంగా ఖ‌ర్చు చేయ‌క‌పోవ‌డం, అవినీతి బ‌య‌ట ప‌డుతుంద‌నే భ‌యంతో వివ‌రాలు వెల్ల‌డించ‌డం లేదో చెప్పాల‌ని వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ డిమాండ్ చేశారు.