Begin typing your search above and press return to search.

రియ‌ల్ వ్యాపారికి 62 ఏళ్లు జైలుశిక్ష‌!

By:  Tupaki Desk   |   23 Sep 2017 5:30 AM GMT
రియ‌ల్ వ్యాపారికి 62 ఏళ్లు జైలుశిక్ష‌!
X
ఒక స్థిరాస్తి వ్యాపారికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది రంగారెడ్డిరెడ్డి జిల్లా వినియోగ‌దారుల ఫోరం. తామిచ్చిన తీర్పుల్ని అమ‌లు చేయ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారికి 62 ఏళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. 31 కేసుల్లో క‌లిపి స్థిరాస్తి వ్యాపారికి విధించిన భారీ జైలుశిక్ష ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రంగారెడ్డి.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల్లోని ప‌లుచోట్ల వేద గాయ‌త్రి ఆగ్ర‌హారం పేరిట వెంచ‌ర్లు వేశారు రాఘేవంద్ర రియ‌ల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఎల్లాప్ర‌గ‌డ ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌. హైద‌రాబాద్ లోని కొత్త‌పేటలో ప్ర‌ధాన కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసిన చేసిన అత‌డు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాల‌కు మాత్ర‌మే ఫ్లాట్లు అమ్ముతానంటూ చిత్ర‌మైన వ్యాపారాన్ని షురూ చేశారు. వేద గాయ‌త్రి ఆగ్ర‌హారం పేరిట వెంచ‌ర్లు వేసి.. ప్ర‌భుత్వం నుంచి అన్ని ర‌కాల అనుమ‌తులు తీసుకున్న‌ట్లుగా భారీ ప్ర‌చారాన్ని చేప‌ట్టారు. ఈ భారీ ప్ర‌చారానికి ఆక‌ర్షితులైన ప‌లువురు ఈ ఫ్లాట్ల‌ను కొనుగోలు చేశారు.

ఫ్లాట్లు కొన్న వారు ఇంటి నిర్మాణాన్నిమొద‌లు పెట్టటంతో లొసుగులు బ‌య‌ట‌ప‌డ్డాయి. వెంచ‌ర్ల‌కు అనుమ‌తులు రాక‌పోవ‌టం.. హెచ్ ఎండీఏ అనుమ‌తి తీసుకోక‌పోవ‌టం.. భూముల‌పై ప‌లు సివిల్ కేసులు ఉండ‌టం లాంటివి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారంతా తాము మోస‌పోయిన‌ట్లుగా గ్ర‌హించారు. దాదాపు 150 మంది బాధితులు వేద గాయ‌త్రి బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లా వినియోగ‌దారుల ఫోరాన్ని ఆశ్ర‌యించారు.

ఈ ఫిర్యాదుల్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన ఫోరం గ‌డిచిన మూడేళ్ల‌లో ప‌లు తీర్పుల్ని వెల్ల‌డించింది. బాధితుల‌కు జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశించింది. అయిన‌ప్ప‌టికీ నిందితుడు ప్ర‌భాక‌ర్ శ‌ర్మ ఫోరం తీర్పుల్ని అమ‌లు చేయ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నారు. దీంతో.. అత‌నిపై ఫోరంలో మ‌రోసారి కేసులు వేయ‌గా.. బెయిల్‌ కు వీల్లేని వారెంట్ల‌ను జారీ చేసింది. తాజాగా ప్ర‌భాక‌ర్ శ‌ర్మ పై వేసిన కేసులో ఒక్కో కేసుకు రెండేళ్లు చొప్పున 31 కేసుల‌కు 62 ఏళ్లు జైలుశిక్ష.. రూ.10వేలు చొప్పున జ‌రిమానాను విధించింది. అన్ని శిక్ష‌లు విడివిడిగా అమ‌లు అవుతాయ‌ని పేర్కొంది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్‌కు త‌ర‌లించారు.