చికాగో సెక్స్ రాకెట్ లో టీడీపీ హస్తం:పద్మ

Thu Jun 21 2018 20:08:58 GMT+0530 (IST)

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చికాగో సెక్స్ రాకెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి పరువు పోవడం వెనుక చంద్రబాబు పాత్ర ఉందని నిప్పులు చెరిగారు. ఆ సెక్స్ రాకెట్ కేవలం కిషన్ దంపతుల వ్యవహారం కాదని - చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన తానా అధ్యక్షుడు వేమన సతీష్ ను ఎఫ్ బీఐ పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు. నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా చంద్రబాబు మరో సన్నిహితుడు కోమటి జయరాం ఉన్న తరుణంలో అక్కడ ఇంత పెద్ద సెక్స్ రాకెట్ బయటకు వచ్చిందని - ఏపీ పరువు కాపాడే బాధ్యత జయరాంకు లేదా అని పద్మ ప్రశ్నించారు. తెలుగు సంఘాల పేరుతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల పరువు మంటగలిపిన చంద్రబాబు ను ఎందుకు క్షమించాలో చెప్పాలని పద్మ ప్రశ్నించారు. బాబుకు అత్యంత సన్నిహితులు...అమెరికాలో తానా - తెలుగు అసోసియేషన్ల పేరుతో ఈ తరహా సెక్స్ రాకెట్ నడుపుతుంటే... .ముఖ్యమంత్రిగారిని ఎందుకు బాధ్యులను చేయకూడదని పద్మ ప్రశ్నించారు. నాలుగేళ్లలో బీజేపీని పల్లెత్తు మాట అనని బాబు 10 రోజుల్లో పది లేఖలు రాయడం రికార్డులా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ కోసం ఢిల్లీ వెళ్లి అక్కడ మోదీపై యుద్ధం అన్న చంద్రబాబు... మోదీ ఎడమచేయి తాకితే చాలన్నట్లుగా వంగి వంగి దండాలు పెట్టిన ఫొటోలు బయటకు వచ్చాయని మండిపడ్డారు. కేంద్రంతో ఏం ఒప్పందం ప్రకారం చంద్రబాబు....హోదా వద్దు... ప్యాకేజీ ముద్దని అన్నారని ఎద్దేవా చేశారు. హోదా - కడప ఉక్కు  ఫ్యాక్టరీతోపాటు పలు విభజన హామీలపై సరైన సమయంలో స్పందించకుండా....ప్రతిపక్షాలను కలుపుకోకుండా ఇపుడు లేఖలు రాస్తున్నానంటే ప్రజలు నమ్మరని దుయ్యబట్టారు.విజయవాడ కాల్ మనీ వ్యవహారంలో కూడా టీడీపీ నేతల పేర్లు బయటకు వచ్చాయని కానీ రెండేళ్ల వరకు టీడీపీ నేతలపై చార్జి షీట్ వేయలేదని చంద్రబాబుపై పద్మ మండిపడ్డారు. కాల్ మనీ కేసులో ఆ రోజే చంద్రబాబు స్పందించి ఉంటే కొద్దో గొప్పో గౌరవం ఉండేదని పద్మ అన్నారు. చంద్రబాబును కాల్ మనీ( కామ సీఎం) సీఎం అన్నందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కూడా విజయవాడలో టీడీపీ నేత కాల్ మనీ లైంగిక బెదిరింపులకు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని మండిపడ్డారు. ఈ రోజు ప్రతి తెలుగు మహిళ కూడా మిమ్మల్ని కాల్ మనీ సీఎం అనే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. కాల్ మనీ తరహాలోనే చికాగో సెక్స్ రాకెట్ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడం చంద్రబాబుకు సాధ్యం కాదని అన్నారు. తెలుగు సంఘాలకు తెలియకుండా ఇదంతా జరిగిందని ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తెలుగు జాతి పరువును చంద్రబాబు మంటగలిపారని అన్నారు. అమెరికాలో తెలుగువారికి ఎవరెస్టు అంత గౌరవం ఉందని....దానిని బూడిదలో వేసిన పన్నీరు చేశారన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు నాలుగేళ్లుగా ఏపీలో చేస్తోన్న అరాచకాలనే....అమెరికాలో ఉన్న చంద్రబాబు సన్నిహితులు చేయడానికి ఆయనే కారణమని అన్నారు. అత్యంత ప్రమాదకరమైన పార్టీగా టీడీపీని ప్రకటించాలన్నారు. టీడీపీ వల్ల ఏపీకి నయాపైసా లాభం లేదని అన్ని రకాలుగా ఏపీని ముంచారని దుయ్యబట్టారు. మహిళలంటే గౌరవం లేని పార్టీ టీడీపీ అని మహిళలను అణగదొక్కడం ఎలాగో నేర్చుకున్న నేతలున్న పార్టీ టీడీపీ అని ఎద్దేవా చేశారు.