Begin typing your search above and press return to search.

కేంద్రం తీరుపై బీజేపీ ఎంపీ ఘాటు విమ‌ర్శ‌లు

By:  Tupaki Desk   |   19 May 2017 4:37 AM GMT
కేంద్రం తీరుపై బీజేపీ ఎంపీ ఘాటు విమ‌ర్శ‌లు
X
సాధార‌ణంగా ప్ర‌భుత్వంలో ఉన్న‌వారి నిర్ణ‌యాల‌ను ఎవ‌రు త‌ప్పుప‌డుతారు? ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు - ప్ర‌జాస్వామ్య వేదిక‌ల్లోని ప్ర‌తినిధులు. అంతే త‌ప్ప అధికార పార్టీలోని నాయ‌కులు - ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ స‌ర్కారును తామే త‌ప్పుప‌ట్ట‌రు క‌దా! ఒక‌వేళ అలా త‌ప్పుప‌ట్టారు అంటే...ఎక్క‌డో తేడా కొట్టిన‌ట్లే అర్థం. ఇప్పుడు ఇదే చ‌ర్చ బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఎంపీ వరుణ్‌ గాంధీ కేంద్రంగా సాగుతోంది. అలహాబాద్ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సదస్సులో వ‌రుణ్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వం తీరును త‌ప్పుప‌ట్టారు. ఓవైపు పలు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా..బడా పారిశ్రామికవేత్తలకు పెద్ద మొత్తాల్లో రుణాలు మాఫీ చేయడాన్ని వరుణ్‌ గాంధీ ఆక్షేపించారు.

రుణమాఫీ విషయంలో ప్రభుత్వాలు వివక్షతో వ్యవహరిస్తున్నాయని వరుణ్‌గాంధీ విమర్శించారు. 2001 నుంచి ఆయా ప్రభుత్వాల హయాంలో రూ.3 లక్షల కోట్లు రుణాలు మాఫీ కాగా, వాటిలో రూ.2 లక్షల కోట్లకుపైగా 30 పారిశ్రామిక సంస్థలకే ప్రయోజనం చేకూరిందని వరుణ్ గాంధీ గుర్తు చేశారు. అయితే,ఈ కాలంలో రెండు బీజేపీ ప్రభుత్వాలకు(వాజ్‌ పేయి - మోడీ) కూడా పాత్ర ఉండటం గమనార్హం. వరుణ్‌ గాంధీ మాటలు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ (బీజేపీ) సిద్ధాంతాలకు భిన్నంగా ఉండటం ఆస‌క్తిక‌రంగానే కాదు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దేశ జనాభాలోని ఒక్క శాతం వ్యక్తులు 50 శాతంకు పైగా వనరులపై ఆధిపత్యం కలిగి ఉండటం న్యాయ సమ్మతం ఎలా అవుతుందని వ‌రుణ్ గాంధీ ప్ర‌శ్నించారు. జనాభాలో మూడోవంతుకు పైగా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని, 90 లక్షల మంది చిన్నారులు శ్రామికులుగా మారి తమను తాము పోషించుకోవాల్సి వస్తున్నదని వరుణ్‌ అన్నారు. `ఇది న్యాయం అని మనం అనగలమా?` అని వరుణ్‌ ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని రైతులను రుణ విముక్తుల్ని చేసేందుకు కృషి చేయనున్నట్టు వరుణ్‌ తెలిపారు. అయితే, తాను సుల్తాన్‌ పూర్‌(ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజకవర్గం)కు మాత్రమే పరిమితం కానని, యావత్‌ దేశానికి ప్రతినిధినని వరుణ్‌ అన్నారు.

ఇటీవ‌ల ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఇటీవల తమిళ రైతుల నిరసన గురించి వరుణ్ గాంధీ ప్రస్తావించారు. తన నియోజకవర్గంలోని రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు చేపట్టినట్టు వరుణ్‌ తెలిపారు. నాలుగువేల మంది రైతుల రుణాల కోసం రూ.22 కోట్ల నిధులు సేకరించినట్టు ఆయన తెలిపారు. తన ఎంపీ నిధుల నుంచి కూడా రూ.2 కోట్లు అందుకు కేటాయించినట్టు ఆయన తెలిపారు. భవిష్యత్‌ రాజకీయాలు కులం - మతం - ప్రాంతాలకు అతీతంగా ఉంటాయని..జల్‌ - జంగిల్‌ - జమీన్‌ - మహిళల సాధికారత నినాదాలే ప్రధాన భూమిక వహిస్తాయని వరుణ్‌ అన్నారు. విదేశీ పెట్టుబడులు దేశాన్ని గొప్పగా మార్చవని, పేదల సంక్షేమం ద్వారానే మహాన్‌ భారత్‌ ఏర్పడుతుందని వరుణ్‌ స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/