Begin typing your search above and press return to search.

మల్లన్నసాగర్ పోరాటం వెనుక ఓటమి ప్రతీకారం?

By:  Tupaki Desk   |   25 July 2016 10:18 AM GMT
మల్లన్నసాగర్ పోరాటం వెనుక ఓటమి ప్రతీకారం?
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తొలిసారిగా తీవ్ర తలనొప్పులు తెస్తున్న అంశం మల్లన్నసాగర్. నిన్న ఆదివారం మల్లన్నసాగర్ నిర్వాసితులు ఆందోళనకు దిగడమే కాకుండా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అయితే.. రాళ్లు రువ్వింది టీడీపీ నేత‌లేనని మంత్రి హ‌రీశ్‌ రావు ఆరోపిస్తున్నారు. ప్ర‌శాంతంగా ఆందోళ‌న చేస్తోన్న రైతుల మ‌ధ్య‌లోకి టీడీపీ నేత‌లు చొరబడి రాళ్లు రువ్వి ఉద్రిక్తతలు రేపారని ఆరోపిస్తున్నారు. రైతులు ఎంత ఆందోళ‌న చేసినా.. సంయ‌మ‌నంతో ఉండాల‌ని ముందుగానే పోలీసుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చామ‌ని ఆయ‌న చెబుతున్నారు. పోలీసులు గాయ‌ప‌డ్డా సంయ‌మనం పాటించార‌ని..కానీ రైతుల ముసుగులో ఆందోళ‌న‌లో క‌లిసిపోయిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు - నేత‌లే పోలీసుల‌పై రాళ్లు విసిరి వారిని గాయ‌ప‌రిచార‌ని ఆరోపించారు. ఈ ఘటన వెనుక కేసీఆర్ చేతిలో ఓడిపోయిన నేత కీలక పాత్ర పోషించారని టీఆరెస్ నేతలు అంటున్నారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రైతువిభాగం అధ్యక్షుడు వంటేరు ప్ర‌తాప్‌ రెడ్డి ఈ అందోళనల వెనుక ఉన్నారని.. ఆయనే ప్రజలను రెచ్చగొడుతున్నారని టీఆరెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వంటేరు ప్ర‌తాప్‌ రెడ్డి సీఎం కేసీఆర్ చేతిలో ఓడిపోయిన తరువాత ఎక్కడ ఎలా దెబ్బతీయాలా అని ఎదురుచూస్తున్నారని.. ఇప్పుడు మల్లన్న సాగర్ రూపంలో ఆయనకు ఛాన్సు వచ్చిందని చెబుతున్నారు.

ప్ర‌తాప్‌ రెడ్డి 2014లో గ‌జ్వేల్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేశారు. కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. మొద‌టి నుంచి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు ప‌రిధిలో ముంపున‌కు గుర‌వుతున్న 14 గ్రామాల ప్ర‌జ‌ల‌కు సంఘీభావంగా ఆయన నిర‌స‌న‌లు తెలుపుతూ వ‌స్తున్నారు. అయితే, ఆదివారం అక‌స్మాత్తుగా రైతులు నిర్వ‌హించ త‌ల‌పెట్టిన రాజీవ్ రహ‌దారి దిగ్బంధ‌నంలో ఆయ‌న కూడా పాల్గొన్నారు. ఆయ‌న వెంట భారీ సంఖ్య‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు - ఆయ‌న అనుచ‌రులు కూడా ఆందోళ‌న‌లో ఉన్నారు. అయితే పోలీసులపైకి వీరే రాళ్లు రువ్వారా లేదా అనడానికి ఆధారాలు లేవు. కానీ.. హరీశ్ అలా ఆరోపిస్తుండడంతో టీఆరెస్ నేతలంతా అదే పల్లవి ఎత్తుకుంటున్నారు.