Begin typing your search above and press return to search.

వంగవీటి దారెటు.?

By:  Tupaki Desk   |   21 Jan 2019 8:02 AM GMT
వంగవీటి దారెటు.?
X
అందరూ అనుకున్నట్లే వైసీపీకి వంగవీటి రాధా గుడ్‌ బై చెప్పేశారు. జగన్‌ లాంటి ఆధిపత్య ధోరణి కలిగిన నాయకుడితో కలిసి ప్రయాణం చేయడం తనవల్ల కాదంటూ చెప్పేశారు. బొత్స లాంటి సీనియర్‌ నాయకుడు మధ్యవర్తిత్వం చేసినా కానీ పట్టువీడలేదు వంగవీటి రాధ. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు రాధా దారెటు. అదే అందరి మదిలో ఉన్న ప్రశ్న.

వంగవీటి రాధ మొదటినుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ప్రజారాజ్యం రాకతో.. కాంగ్రెస్‌ ని కాదని మెగాస్టార్‌ తో కలిశారు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ గెలుపు మాత్రం అందుకోలేక పోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాస్తా కాంగ్రెస్‌ లో కలిసిపోయింది. అయితే కాంగ్రెస్‌లో ఉండలేక .. వైసీపీలో చేరారు రాధ. ఇప్పుడు వైసీపీకి కూడా గుడ్‌ బై చెప్పేశారు. ఇప్పుడు రాధ ముందు ఉన్న ఆప్షన్స్ రెండే రెండు. ఒకటి టీడీపీ, రెండు జనసేన.

తన తండ్రిన చంపిన పార్టీ టీడీపీ అని ఇప్పటికే చాలాసార్లు ఆరోపించారు వంగవీటి రాధ. ఇలాంటి టైమ్‌ లో టీడీపీలో కనుక చేరితే.. ఉన్న బలం, బలగం మొత్తం తన నుంచి వెళ్లిపోతుందని రాధాకి తెలుసు. అన్నింటికి మించి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారతాడు అనే అపప్రదను కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల .. టీడీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. ఇక ఆయన ముందున్న మరో ఆప్షన్‌ జనసేన. జనసేనకు సంబంధించి కృష్ణా జిల్లాకు బలమైన నాయకుడు లేడు. ఇప్పుడు కనుక జనసేనలో చేరితో జిల్లా రాజకీయాల్ని శాసించే అవకాశం వస్తుంది. అయితే.. ఇప్పటికే కాపుల పార్టీగా ముద్రపడిన జనసేనలోకి రాధాని పవన్‌ కల్యాణ్‌ అహ్వానిస్తాడా లేదా అనేదే అసలు సమస్య. అయితే.. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని… స్పష్టమైన హామీ లభించిన తర్వాత వైసీపీకి రాధ రిజైన్‌ చేశారని వార్తలు విన్పిస్తున్నాయి. సో.. ఎలా చూసినా వంగవీటి దారి జనసేన వైపే.