Begin typing your search above and press return to search.

కేసీఆర్ బీసీ బ‌డ్జెట్ మంత్రం గుట్టు విప్పిన కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   21 Feb 2017 11:35 AM GMT
కేసీఆర్ బీసీ బ‌డ్జెట్ మంత్రం గుట్టు విప్పిన కాంగ్రెస్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాల‌పై మ‌రోమారు చ‌ర్చ మొద‌లైంది. రాష్ట్ర జనాభాలో బీసీలు 56 శాతం ఉన్న నేప‌థ్యంలో బీసీలే తారక మంత్రం అనే అజెండానే టీఆర్‌ ఎస్‌ సర్కారు వ్యూహమ‌ని చెప్తున్నారు. అందుకే రానున్న బడ్జెట్‌ లో ఈ అంశాలే కీలకం కాబోతున్నాయ‌ని అంటున్నారు. ఇందుకనుగుణంగా బడ్జెట్‌ కూర్పు ఉండాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. బీసీల్లో అధికంగా ఉండే గొర్రెలు - మేకల కాపరులు (యాదవులు) - మత్స్యకారులు (ముదిరాజులు) - చేనేత కార్మికులు (పద్మశాలీలు) - కల్లుగీత కార్మికుల (గౌడ కులస్తులు)కు అత్యధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. బీసీ జనాభాలో ఈ నాలుగు సామాజిక తరగతులు అత్యధికంగా ఉండటంతోపాటు మిగతా తరగతుల్ని నియంత్రించే (డామినేట్‌) సామర్థ్యం కలిగున్నా యని సర్కారు భావిస్తోంది. ఈ కోణంలోంచి ఆలోచించే వెనుకబడిన తరగతులకు బడ్జెట్‌ లో సుమారు రూ.4 వేల కోట్లు కేటాయించేలా సీఎం దిశానిర్దేశం చేశారు. అయితే దీని వెనుక వేరే మత‌లబు ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆ వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

ఈ మార్చితో ముగుస్తున్న‌ ప్రస్తుత బడ్జెట్లో బీసీల కోసం రూ.2,500 కోట్లు కేటాయించిన విషయం విదితమే. వీరికి ఎక్కువ నిధులను కేటాయించటం ద్వారా ఎన్నికల నాటికి ఆయా సామాజిక తరగతుల్ని మరింత దగ్గర చేసుకునేందుకు వీలుగా ఆయన వ్యూహం పన్నుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులం - గొర్రెల కాపర్లకు సబ్సిడీ మీద గొర్రెల పంపిణీ - మత్స్యకారుల వృత్తి రక్షణకు వీలుగా చేప పిల్లలను చెరువుల్లో వదలటం - చేనేత - మరమగ్గాల కార్మికుల స్థితిగతులపై సమీక్షల మీద సమీక్షలు - కల్లు కాంపౌండ్ల ఏర్పాటు తదితర చర్యలు చేపడుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. గొర్రెల కొనుగోళ్ల కోసం జిల్లా కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. వాస్తవానికి టీఆర్‌ ఎస్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక రెండున్నరేండ్ల వరకూ వివిధ సామాజిక తరగతుల గురించి పట్టించుకోలేదు. దీంతో ఆయా తరగతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇదే సమయంలో సామాజిక సమస్యలే అజెండాగా వివిధ ఉద్యమాలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనే బడ్జెట్‌ లో బీసీలకు పెద్ద పీట వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు అంత రించిపోతున్న కుల వృత్తుల (కుమ్మరి - కమ్మరి - కంసాలి తదితరాలు)తోపాటు సంచార జాతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు వీలుగా బడ్జెట్‌ లో పెద్ద పీట వేయాలని సర్కారు నిర్ణయించినట్టు సమాచారం.

అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కేసీఆర్ అడుగుల వెనుక కుట్ర‌లు ఉన్నాయ‌ని ఆరోపించారు.తెలంగాణ ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుతుందనుకుంటే...కేసీఆర్‌ పాలనలో బడుగుల బతుకులలో బలిపీఠం ఎక్కించేలా ఉంద‌న్నారు. బలహీనవర్గాల అభ్యున్నతిలో కేసీఆర్ మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటడం లేదని ఆరోపించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులు 6738 కోట్లు .. కానీ ఖర్చు చేసింది 3 నుంచి నాలుగువేల కోట్లు మాత్రమేని తెలిపారు. మ్యానిఫెస్టోలో 25 వేళా కోట్లు బడుగుల అభ్యున్నతికి ఖర్చు చేస్తామని కేసీఆర్ చెప్పార‌ని అయితే....ఆచరణలో ఏం చేశారో ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. బీసీలపట్ల కేసీఆర్ చూపుతున్న ప్రేమ మొసలి కన్నీరు వంటిద‌న్నారు. అసెంబ్లీలో బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ .. దాన్ని తప్పించుకునేందుకు బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నార‌ని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ అసమర్థత వాళ్ళ బీసీ విద్యార్థులకు విదేశీ విద్యా దూరమ‌వుతోందన్నారు. విదేశీ విద్యకోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల పేర్లు వెబ్ సైట్ లో పెట్టకపోవడం వల్ల .. ఆ విద్యార్థులకు వీసా రిజెక్ట్ కావడం ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకోకుండా .. చిత్తశుద్ధితో ఆ వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/