Begin typing your search above and press return to search.

సిక్కోలు మాట‌!... వైఎస్‌ కు రుణ‌ప‌డిపోతాం!

By:  Tupaki Desk   |   26 Sep 2017 6:21 AM GMT
సిక్కోలు మాట‌!... వైఎస్‌ కు రుణ‌ప‌డిపోతాం!
X
రాష్ట్రంలో త‌న‌దైన పాల‌న‌లో నూత‌న చ‌రిత్ర‌కు నాంది ప‌లికిన దివంగ‌త వైఎస్ రాజశేఖ‌ర‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఘ‌న నివాళులు అర్పించారు. ఆయ‌న చేసిన కృషి వ‌ల్లే.. వంశ‌ధార ట్రిబ్యునల్‌ లో కేసును గెలిచామని నేతలు కొనియాడారు. వంశధారి నది ఒడ్డున కాట్రగడ్డ వద్ద వైఎస్ ఆర్‌ కు కృతజ్ఞతాపూర్వకంగా నేతలు నివాళులు అర్పించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా పార్టీ అభిమానులు తరలివచ్చి తమ మద్ధతు తెలిపారు. వైఎస్ ఆర్‌ కు పేరు వస్తుందని నేరడి బ్యారేజ్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తే పోరాటం చేస్తామని వైఎస్ ఆర్ సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు - తమ్మినేని సీతారాం - రెడ్డి శాంతి చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

ఏపీ ప్రతిపక్షనేత - వైఎస్ ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారా జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు వంశధార నీరు తెచ్చే మహత్తర కార్యక్రమం జరిపిస్తామని పార్టీ నేతలు హామీ ఇచ్చారు. వైఎస్ ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒడిశా ప్రభుత్వంతో సమావేశమై ప్రాజెక్టు ముందుకు పోవడానికి అంత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, వంశ‌ధార విష‌యంలో ఒడిసా ప్ర‌భుత్వానికి - ఏపీ ప్ర‌భుత్వానికి ఘ‌ర్ష‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మ‌హాన‌దిపై ఏపీ ప్ర‌భుత్వం వైఎస్ హ‌యాంలో రెండు ప్రాజెక్టుల‌ను ప్ర‌తిపాదించింది. ఒక‌టి కాట్ర‌గ‌డ్డ‌ - రెండు నేరెడి బ్యారేజీలు నిర్మిస్తోంది.

అయితే - ఒడిసా దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఇటీవ‌ల దీనిపై విచార‌ణ జ‌రిపిన వంశ‌ధార జ‌ల వివాద ప‌రిష్కార ట్రిబ్యున‌ల్ మ‌న‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. నేరెడి ప్రాజెక్టును నిర్మించుకునేందుకు ప‌చ్చ‌జెండా ఊపింది. నిజానికి ఈ ప్రాజెక్టు వైఎస్ హ‌యాంలోనే పూర్తి కావాల్సి ఉంది. అయితే, వివాదం కార‌ణంగా ఆల‌స్య‌మైంది. కాగా, ఇప్పుడు వంశ‌ధార ట్రిబ్యున‌ల్ ఏపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వ‌డంపై వైసీపీ ఆనందం వ్య‌క్తం చేసింది. వైఎస్ చ‌ల‌వ వ‌ల్లే.. ఈ కేసులో గెలిచామ‌ని నేత‌లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే శ్రీకాకుళం స‌హా చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోని రైతుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.