Begin typing your search above and press return to search.

నెల్లూరులో కలకలం..వీవీ ప్యాట్ స్లిప్స్ బయటకొచ్చాయి

By:  Tupaki Desk   |   15 April 2019 2:01 PM GMT
నెల్లూరులో కలకలం..వీవీ ప్యాట్ స్లిప్స్ బయటకొచ్చాయి
X
2019 సార్వత్రిక ఎన్నికలకు సంబందించి వచ్చిన ఆరోపణలు గతంలో ఏ ఎన్నికల్లోనూ వచ్చి ఉండవు. ఈవీఎంలపై పలు పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించాయి. ఈవీఎంల వినియోగం - వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశాలపై చాలా కాలం నుంచి చర్చ జరుగుతూ ఉండగా... పోలింగ్ సందర్భంగా ఎదరైన పలు ఇబ్బందుల నేపథ్యంలో నిజంగానే ఈవీఎంల పనితీరుపై మరింత పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. పోలింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవీఎంలలో ఎవరికి ఓటేసినా... ఒకే పార్టీకి ఓటు పడుతోందన్న ఆరోపణలు కూడా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ వైపు చర్చ జరుగుతుండగానే.... నెల్లూరులో మరో పెను కలకలమే రేగింది. ఈ ఘటన ఎన్నికల నిర్వహణపై అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీకి మరో అస్త్రాన్ని అందించినట్టేనన్న వాదన కూడా వినిపిస్తోంది.

పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలన్నింటినీ స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఈ స్ట్రాంగ్ రూంల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చీమ చిటుక్కుమన్నా కూడా విపక్షాలు గగ్గోలు పెట్టడం ఖాయమే. ఇలాంటి తరుణంలో నెల్లూరు జిల్లాలో పెను కలకలమే రేగింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలలోనే ఉండాల్సిన వీవీ ప్యాట్స్ స్లిప్స్ బయటకు వచ్చేశాయి. జిల్లాలోని ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏకంగా 200 వీవీ ప్యాట్ స్లిప్స్ కనిపించాయి. అప్పటికే ఎన్నికల నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. వార్త తెలిసిన ఈసీ కూడా స్థానికంగా ఉన్న రిటర్నింగ్ అధికారిని అప్రమత్తం చేసింది. దీంతో ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి అక్కడికి పరుగులు పెట్టక తప్పలేదు.

పాఠశాల ఆవరణలో కనిపించిన వీవీ ప్యాట్ స్లిప్స్ ను పరిశీలించిన ఆయన... ఇందులో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదని తేల్చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల వినియోగంపై శిక్షణ ఇచ్చిన సందర్భంగా వాడిన స్లిప్పులే ఇవి అని ఆయన తేల్చేశారు. పోలింగ్ కు, ఈ వీవీ ప్యాట్ స్లిప్స్ కు ఎలాంటి సంబంధం లేదని కూడా తేల్చేశారు. అయితే శిక్షణ సందర్భంగా వాడిన వీవీ ప్యాట్ స్లిప్స్ ను కూడా దాచాల్సిన అవసరం ఉందని, అందుకు విరుద్దంగా వీటిని పారేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఈవీఎంల పనితీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ తరహా పార్టీలకు మరో అస్త్రం దొరికేసిందనే చెప్పక తప్పదు.