Begin typing your search above and press return to search.

వీహెచ్‌ పీ కొత్త ఉద్య‌మం...ఎజెండా అదే

By:  Tupaki Desk   |   21 March 2017 11:32 AM GMT
వీహెచ్‌ పీ కొత్త ఉద్య‌మం...ఎజెండా అదే
X
అయోధ్య‌లో రామ మందిరం కోసం విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌ పీ) కొత్త ఉద్య‌మానికి శ్రీకారం చుట్టింది. దీనికి రామ్ మ‌హోత్స‌వ్ పేరు పెట్టింది. హిందుత్వ వాది యోగి ఆదిత్య‌నాథ్ యూపీ సీఎం కాగానే, రామమందిర స‌మ‌స్య‌ను చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని సుప్రీంకోర్టు సూచించిన రోజే వీహెచ్‌ పీ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వ‌ర‌కు ఈ ఉద్య‌మం కొన‌సాగుతుంద‌ని వీహెచ్‌పీ వెల్ల‌డించింది. ప్ర‌జ‌లంద‌రి న్యాయ‌మైన కోరిక అయిన రామాల‌యం నిర్మాణం ఎజెండాగా త‌మ కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని వివ‌రించింది. ప్ర‌జాస్వామ్య‌యుతంగా జరిగే ఈ ఉద్య‌మంలో క‌లిసి రావాలని కోరింది.

"మార్చి 28న హిందువుల కొత్త ఏడాది మొద‌ల‌వుతుంది. దానికి రెండు రోజుల ముందు రామ్ మ‌హోత్స‌వ్ పేరుతో ఉద్య‌మం మొద‌లుపెడ‌తాం. ఈ సంద‌ర్భంగా గ్రామగ్రామానికి వెళ్లి ప్ర‌జ‌ల‌ను జాగృతం చేస్తాం. అయోధ్య‌లో రామ‌మందిరాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని డిమాండ్ చేస్తూ జాగ‌ర‌న్ యాత్ర చేస్తాం. ఆల‌య నిర్మాణాన్ని ఆల‌స్యం చేయ‌డానికి ఇప్పుడు మ‌రో కార‌ణం కూడా లేదు" అని వీహెచ్‌పీ జోన‌ల్ ప్రెసిడెంట్ ఈశ్వరిప్ర‌సాద్ తెలిపారు. ఇది దేశ‌వ్యాప్త ఉద్య‌మ‌మని, రెండు ల‌క్ష‌ల గ్రామాల్లో యాత్ర‌లు చేప‌డ‌తామ‌ని ఆయ‌న స్పష్టంచేశారు. అయితే రామ‌జ‌న్మ‌భూమి అయిన‌ యూపీపైనే ఎక్కువ‌గా దృష్టిసారిస్తామ‌ని చెప్పారు. ఈ రెండు ల‌క్ష‌ల గ్రామాల్లో 70 వేలు యూపీలోవేన‌ని, ఆ గ్రామాల్లోని ప్ర‌తి ఇంటిపై త్వ‌ర‌లోనే కాషాయ జెండాను చూస్తార‌ని ప్ర‌సాద్ తెలిపారు. హిందుత్వ వాది అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త‌మ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలుపుతార‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. "రాష్ట్రం, కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఉంది. ఇప్ప‌టికే మూడు ల‌క్ష‌ల గ్రామాల నుంచి రామ భ‌క్తులు ఇటుక‌లు పంపించారు. రామమందిర నిధి కూడా సిద్ధంగా ఉంది. అయితే క‌చ్చితంగా రాముడు ఎక్క‌డ జ‌న్మించాడో అదే స్థ‌లంలోనే ఆల‌య నిర్మాణం జ‌ర‌గాలి. ఈ విష‌యంలో సీఎం రాజీప‌డ‌బోరు" అని ఈశ్వ‌రి ప్ర‌సాద్ స్ప‌ష్టంచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/