Begin typing your search above and press return to search.

విదేశాల్లో బతుకమ్మ ఆడుడేంది కవిత?

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:36 AM GMT
విదేశాల్లో బతుకమ్మ ఆడుడేంది కవిత?
X
కొన్ని పేర్లు చెప్పినంతనే కొంతమంది గుర్తుకు వస్తారు. అలాంటి వాటిల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె , నిజామాబాదు ఎంపీ కవిత పేరు చెప్పినంతనే బతుకమ్మ గుర్తుకు రావటం ఖాయం. కవితకు కొన్ని దశాబ్దాల ముందే తెలంగాణ సమాజంలో బతుకమ్మ సంస్కృతి ఉన్నప్పటికి.. దాన్నో భావోద్వగ అంశంగా రూపుదిద్ది.. దానికి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చింది మాత్రం కవిత అనే చెప్పాలి.

ఒక ఎన్టీవోను ఏర్పాటు చేసి బతుకమ్మ పేరుతో భావోద్వేగ బంధాన్ని మహిళల్లో పెంచటమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ ఆడటాన్ని అందరి మదిలో ముద్రపడేలా చేయటంలో కవిత కీలక భూమిక పోషించారని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగా వేసిన ఎత్తులు చాలానే ఉన్నా.. తెలంగాణ ప్రజల్ని కనెక్ట్ చేసే సాంస్కృతి అంశాలు చాలానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇలా బతుకమ్మను తెలంగాణ సమాజంలో మరింతగా ముడివేసిన కవిత.. ఎంతగా ఎదిగారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. బతుకమ్మ పేరుతో దూసుకెళ్లే కవిత.. ఈ ఏడాది ఈ పర్వదినాన ఫారిన్ లో ఉండటం గమనార్హం.

ఈ ఏడాది విదేశాల్లో బతుకమ్మల్ని ఆడేందుకు ప్రత్యేకంగా ఫారిన్ వెళ్లిన కవితపై తీవ్ర మండిపాటు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు. విదేశాల్లో బతుకమ్మ ఆడేందుకు వెళ్లిన కవిత.. బతుకమ్మను ఆడాల్సింది ఫారిన్ లో కాదని... ఆ పేరుమీద ఉన్న బతుకమ్మ కుంట దగ్గర ఆడాలన్నారు. బతుకమ్మ పేరుతో ఉన్న చెరువును రక్షించుకునేందుకు కవిత బతుకమ్మ ఆడాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు. తన డిమాండ్ కు తగ్గట్లు తాజాగా ఎంపీ కవితకు వీహెచ్ ఒక లేఖ రాశారు. కొసమెరుపు ఏమిటంటే.. బతుకమ్మ ఆడేందుకు కవిత ఫారిన్ వెళ్లిన తర్వాత వీహెచ్ తీరుబడిగా లేఖ రాయటం. వీహెచ్ లేఖ ఆమె దృష్టికి వెళ్లేసరికి.. ఈసారికి బతుకమ్మ అయిపోతుంది కూడా. విదేశాలకు వెళ్లిన తర్వాత లెటర్ రాస్తే ఎలా వీహెచ్..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/